కామారెడ్డి (డైలీ భారత్): ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కావెంజర్లకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల లింగం ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడంలో స్కావెంజర్లు ప్రతిరోజూ కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారికి నెలల తరబడి జీతాలు అందకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.
నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఇకపై ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కావెంజర్ల సమస్యపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా కమిటీ తరఫున జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి కోరారు.