7 రోజుల్లో ఇంటికే స్పీడ్ పోస్టు, DTO శంకర్ నాయక్ స్పష్టీకరణ
మహబూబాబాద్ (డైలీ భారత్): మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఎలాంటి పెండింగ్ ఆర్సీ, డీఎల్ కార్డులు లేవని, "స్పీడీ డిస్పోజ్, ఎర్లీ డిస్పాచ్" నినాదంతో 7 పనిదినాల్లోనే కార్డులను ఇంటికి స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ తెలిపారు.
చాలామంది వాహన యజమానులు కార్డులు అందలేదని కార్యాలయానికి వస్తున్నారని, అయితే అన్ని కార్డులు ఆధార్‌లో నమోదైన చిరునామాకు స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 7 పనిదినాల్లో కార్డు అందకపోతే సమీప పోస్టాఫీసును, ఆ తర్వాత కూడా రాకపోతే నేరుగా ఆర్టీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
ప్రతి సేవకు కాలపరిమితి :
1. LLR: దరఖాస్తు ప్రక్రియ గంటలో పూర్తి
2. DL, RC: 7 పనిదినాల్లో ఇంటికి స్పీడ్ పోస్టు ద్వారా పంపిణీ
3. కమర్షియల్ వాహనాల RC, పర్మిట్, FC: అదే రోజు డెలివరీ
వాహనాన్ని విక్రయించిన తర్వాత యాజమాన్య బదిలీ తప్పనిసరిగా చేయించుకోవాలని DTO హెచ్చరించారు. బదిలీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ రికార్డుల్లో వాహనం పాత యజమాని పేరుపైనే ఉండి, పింఛన్ వంటి పథకాలకు అనర్హులుగా మారుతున్నారని తెలిపారు. కొనుగోలుదారుడి పేరుపై బదిలీ జరిగేలా విక్రేత స్వయంగా దగ్గరుండి చూసుకోవాలని సూచించారు.