డైలీ భారత్, వికారాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఘాట్ రోడ్డు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బస్సులో ప్రయాణిస్తున్న మరో 50 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 52 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక సమాచారం.
అంత్యక్రియలకు వెళ్తుండగా విషాదం
పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం కేసారం (క్యాసారం) గ్రామానికి చెందిన గ్రామస్థులు నారాయణ రెడ్డి అనే వ్యక్తి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రైవేట్ బస్సులో ధారూర్ మండలం చింతకుంట గ్రామానికి బయలుదేరారు. బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డు మలుపు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది.
మృతుల వివరాలు
ఈ ప్రమాదంలో మరణించిన నలుగురు బాధితులను కేసారం గ్రామానికి చెందిన మహిళలుగా పోలీసులు గుర్తించారు:
ప్రమీల (52)
యాదమ్మ (52)
మాల పద్మ (50)
పద్మమ్మ (55)
యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వాహనదారులు, గ్రామస్థులు ప్రాణాలకు తెగించి లోయలోకి దిగారు. బస్సు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా (IPS), జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు.
గాయపడిన ప్రయాణికులందరినీ 108 అంబులెన్స్‌లలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, వారికి మెరుగైన అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ దిగ్భ్రాంతి
అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర ఉచిత వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు.
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర వేదన వ్యక్తం చేశారు. బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించాలని స్థానిక పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు బస్సును లోయలో నుండి తీసేందుకు భారీ క్రేన్లను రంగంలోకి దించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.