సూర్యాపేట (డైలీ భారత్): చిట్టీలు, డెయిలీ కలెక్షన్లు, అధిక రాబడి పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో ఇద్దరిని చివ్వెంల పోలీసులు అరెస్ట్ చేశారు.
సూర్యాపేట డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసన్న కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ జి. రాజశేఖర్, ఎస్‌ఐ వి. మహేష్, ఎస్‌ఐ వెంకన్న పాల్గొన్నారు.
నిందితులు:
1. బానోత్ రాజు (44) - ప్రభుత్వ ఉపాధ్యాయుడు, యెనగండి తండా, చివ్వెంల మండలం
2. బానోతు అనూష (33) - భార్య, గృహిణి
పోలీసుల కథనం ప్రకారం, నిందితులు 2015 నుంచి అధిక రాబడులు, నెలవారీ చెల్లింపులు ఇస్తామని నమ్మించి ప్రజలు, తోటి ఉద్యోగులు, పరిచయస్తుల నుంచి భారీగా డబ్బులు సేకరించారు. భూములు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పి కూడా నగదు తీసుకున్నారు. సేకరించిన డబ్బులో కొంత వ్యక్తిగత అవసరాలు, ఆస్తుల కొనుగోలుకు వాడగా, మిగిలిన మొత్తాన్ని 500-600 మందికి రూ.10 వేల నుంచి రూ.2 లక్షల వరకు నెలకు 10% వడ్డీకి అప్పుగా ఇచ్చారు.
ఆర్థిక వివరాలు:
- వసూలు చేసిన మొత్తం: రూ.6,24,50,000
- తిరిగి చెల్లించినది: రూ.3,18,54,000
- చెల్లించాల్సిన బకాయి: రూ.3,05,96,000
ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బాండ్లు, భూ లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ తెలిపారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
ఈ దంపతుల చేతిలో మోసపోయిన ఇతర బాధితులు ఆధారాలతో చివ్వెంల పోలీసులను సంప్రదించాలని, అధిక రాబడి పేరుతో మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.