డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాధితుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఈ కార్యక్రమానికి హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 21 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను క్షుణ్ణంగా విన్న అనంతరం, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు వెంటనే ఫోన్ చేసి చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం ద్వారా బాధితులకు సత్వర న్యాయం అందిస్తున్నామన్నారు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. వినతులు స్వీకరించి అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. దీనివల్ల ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.
గ్రీవెన్స్ డేలో వచ్చే అన్ని ఫిర్యాదులను ఆన్ లైన్ లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ విధంగా ప్రజలకు మరింత సమర్ధవంతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని ఎస్పీ తెలిపారు.