| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హాజిపల్లి రైతుల అంశాన్ని కలెక్టర్ కు వివరించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

హాజిపల్లి రైతుల అంశాన్ని కలెక్టర్ కు వివరించిన ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

పట్టా భూములను అసైన్డ్ గా చూపారు

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో హాజిపల్లి గ్రామస్థుల వినతి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పైలెట్ ప్రాజెక్టు కింద తమ గ్రామాన్ని ఎంచుకుని పట్టా భూములను కాస్త ప్రభుత్వ అసైన్డ్ భూములుగా మార్చారని దీంతో చిన్నాచితక రైతులు ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నారని, బాధిత రైతులకు న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలెక్టర్ నారాయణ రెడ్డి దృష్టికి తెచ్చారు. మంగళవారం హాజీ పల్లి గ్రామ కాంగ్రెస్ నాయకుడు సింగారం సుదర్శన్, సీనియర్ జర్నలిస్ట్ గణేష్ తదితరులతో గ్రామానికి సంబంధించిన బాధిత రైతులతో కలెక్టర్ ను కలిశారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలం హాజీపల్లి గ్రామానికి చెందిన రెైతులు కలెక్టర్ ముందు ఎమ్మెల్యే సమక్షంలో తమగోడు వెళ్లబోసుకున్నారు. ఈ సంధర్బంగా రైతులు జిల్లా కలెక్టర్ తో తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు నూతన పట్టదారు పాసు పుస్తకాలని జారీ చేసిందనీ, ముందుగా హాజీపల్లి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించిందని తెలిపారు. అలా కొత్త పాసు పుస్తకాలు తీసుకున్న రైతులలో 29 మందికి చెందిన భూముల స్వభావం పట్టాకు బదులుగా అసైన్డ్ పొలంగా నమోదై ఉందని వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లగా జరిగిన తప్పును గ్రహించిన అప్పటి జిల్లా కలెక్టర్ మరుసటి రోజే అవి అసైన్డ్ భూములు కావని, పట్టా భూములేనని ప్రొసీడింగ్ ను ఇచ్చి రైతులకు మరోసారి నూతన పాసు బుక్కులను జారీ చేశారనీ తెలిపారు. రెండవ సారి పాసు పుస్తకాలు పొందిన హాజీపల్లి గ్రామ రైతులు తమ భూములు పట్టా భూములుగా ఉన్నా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఆధారంగా రెవెన్యూ యంత్రాంగం ఆన్లైన్ రికార్డుల్లో ల్యాండ్ స్వభావం మార్చకుండా అలాగే వదిలేయ డంతో ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్లో మరోసారి ఆ భూములు కాస్త అసైన్డ్ భూములుగా చూపుతున్నాయన్నారు. ఈ క్రమంలో తమ భూములు తాము కాపాడుకునేందుకు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూములుగా నమోదైన రైతులలో ఏ ఒక్కరు భూస్వాములు లేరనీ రెండు ఎకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులే ఉండడంతో పేద రైతులు డబ్బులు పెట్టి దరఖాస్తులు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొందని కలెక్టర్ కు వివరించారు. కుటుంబ అవసరాల నిమిత్తం పొలాన్ని అమ్ముకోలేక బయట అప్పులు తెచ్చు కోలేక ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు.

Previous కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే బర్తరఫ్ చేయాలి : చల్లా నరసింహారెడ్డి
Next సమగ్ర శిక్ష, URS, ఉద్యోగుల, ఉపాధ్యాయినిల సమ్మె కు TPTF మద్దతు
ADVERTISEMENT