డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయం కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆకాంక్షించారు. భాగస్వాముల అందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. రాజేంద్రనగర్ లో రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్ లోని పిజెటీఏయు క్రీడా మైదానంలో కిసాన్ మేళా, వ్యవసాయ ప్రదర్శనల్ని ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్ ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పిజెటీఏయు ఉపకులపతి అల్దాస్ జానయ్య తో కలిసి ప్రారంభించారు. కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. తర్వాత విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ అభివృద్ధికి అసమాన సేవల్ని అందించిందన్నారు. సొనామసూరి, తెలంగాణ సోనా వంటి వంగడాలు రూపొందించిందన్నారు. భవిష్యత్ ప్రణాళికల అమలులో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్ సూచించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ సహాయంతో విశ్వవిద్యాలయం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీజులు తగ్గించడం స్వాగతించదగినదన్నారు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీద ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లని ఎదుర్కొని మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గవర్నమెంట్ పిలుపునిచ్చారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన కిసాన్ మేళా లోను తుమ్మల నాగేశ్వరరావు రైతులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు, మన నేల స్వభావానికి తగ్గట్లుగా అనువైన పంటలు, అందుకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకి ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. హార్టికల్చర్, పంటలు, కూరగాయలు పామాయిల్ సాగు పెరగాలన్నారు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి చేయుతనిస్తామన్నారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని వ్యవసాయ రంగంలో అధిక జనాభా నిమగ్నం కావాలని తుమ్మల ఆకాంక్షించారు. దేశ ప్రధానుల చేతుల మీద ప్రారంభమైన విశ్వవిద్యాలయం రైతాంగానికి ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉందని ఆయనన్నారు. గత కొన్నేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం వెనుకబాటుకి గురి అయింది అని.. దాని అధిగమించి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఉపయోగించుకుని పరిశోధన, విస్తరణ విద్యలో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలని తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.విద్య, పరిశోధన, విస్తరణల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ జన్యు మార్పిడి పంటల సాగు నీ అనుసరించవలసిందేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇక్రిసాట్, క్రిడా వంటి సంస్థల సహకారం తీసుకోవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. రైతుల కష్టాలు నాటికి నేటికి అలానే ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ధరల పెరుగుదల, వాతావరణ మార్పులకి అనుగుణంగా రైతులకి చాలా చేయవలసి ఉందని ఆయన అన్నారు. వందేళ్ళ క్రితమే వ్యవసాయంగా ప్రాముఖ్యత గురించి మహాత్మా గాంధీ చెప్పారని మరో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సమరసింహా రెడ్డి అన్నారు. వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతులకు అందుబాటులో ఉంచాలని సమరసింహారెడ్డి సూచించారు. 60 ఏళ్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తానాన్ని పీజేటీఏయు ఉపకులపతి అల్దాస్ జానయ్య వివరించారు. నాటి ప్రధానులు లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ లు, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఉపరాష్ట్రపతి మొరార్జీ దేశాయ్ లు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం చుట్టూ సుమారు 10 భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య వివరించారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32 వేల మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించిన వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇతర పంటల్లోనూ విశ్వవిద్యాలయం రూపొందించిన వంగడాలు విస్తృత వ్యాప్తి పొందాయన్నారు. 21 పేటెంట్లు సాధించామన్నారు అలాగే పౌల్ట్రీ, పశుసంవర్ధక రంగాల్లోనూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అపూర్వ ప్రగతి సాధించిందని అల్దాస్ జానయ్య అన్నారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల విశ్వవిద్యాలయం ప్రయాణం పై ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే వివిధ సాగు పద్ధతులపై అనేక ప్రచురణల్ని కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఏసిపి రఘునందన్ రావు, కమిషనర్ బి. గోపి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్ రాజు, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజి రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పద్మశ్రీ గ్రహీతలు చింతల వెంకటరెడ్డి,వెంకటేశ్వర రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవ రెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్ రావు, పూర్వ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.