| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం

నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం

డైలీ భారత్, రత్నగిరి జిల్లా: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన  తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా వైద్యులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్నారు. మహిళలపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కోల్‌కతా ఘటన మరవకముందే.. తాజాగా మహారాష్ట్ర లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రత్నగిరి జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌  అత్యాచారానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 19 ఏళ్ల నర్సింగ్‌ ట్రైనీ విద్యార్థిని కళాశాలను ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. దారి మధ్యలో విద్యార్థినితో డ్రైవర్‌ మాటలు కలిపాడు. తాగేందుకు మంచినీరు అందించాడు. అయితే అప్పటికే ఆ నీటిలో మత్తుమందు కలిపి ఉండటంతో.. అవి తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత డ్రైవర్‌ నిర్మానుష్య ప్రదేశానికి యువతిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై అత్యాచారం జరిగిందని గ్రహించింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.

దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బాధిత విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ కేసులో సత్వర చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తూ గంటల తరబడి రహదారిని దిగ్బంధించారు

Previous ప్రజాస్వామ్య దేశంలో న్యాయమే గెలిచింది : భారత జాగృతి కన్వీనర్ ఎండి ముస్తఫా
Next ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసు అక్రమం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
ADVERTISEMENT