లక్ష్మీదేవి పల్లిని సందర్శించిన పాలమూరు, రంగారెడ్ది కాంగ్రెస్ ఎమ్మేల్యేలు
ఏఐసిసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి తదితరుల చలో పాలమూరు ఎత్తిపోతల విజయవంతం
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్ఞానం లేకనే షాద్ నగర్ నియోజక వర్గంలోని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు మొదలు పెట్టలేదని ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ధ్వజమెత్తారు. శుక్రవారం చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలువు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఉదయం కరివవెన ప్రాజెక్ట్, మధ్యాహ్నం మూడు గంటలకు ఉదండాపూర్ ప్రాజెక్ట్, సాయంత్రం షాద్ నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్
ప్రకటిత స్థలాన్ని కాంగ్రెస్ బృందం పరిశీలించింది. ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి ,షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి తదితరులు లక్ష్మీదేవి పల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత కేసీఆర్దేనని దుయ్యబట్టారు. పదేళ్లు టిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక్క నాయకుడు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఏర్పాటుకు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు.
పదేళ్లలో పాలమూరుకు తీవ్ర అన్యాయం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దని అందుకే ప్రజలు గత ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పారని అన్నారు. టిఆర్ఎస్ ఓటమికి పాలమూరు జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడమే ముఖ్య కారణం అన్నారు. ఏఐసీసీ సభ్యులు చల్ల వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో వాటా విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్న ఆయన, ఆంధ్రాపాలకులు నీటిని తరలించుకుపోతుంటే వారికి సహకరించారని విమర్శించారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన కేసీఆర్, పదేళ్లలో ఎకరానికైనా నీళ్లిచ్చారా అని వంశీచంద్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నిర్మాణ లోపాలతోనే మేడిగడ్డ కుంగిపోయిందన్న ఆయన, గులాబీ నేతలకు కనీసం పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు. తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయిస్తే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా బీఆర్ఎస్ సాధించలేకపోయింది. వచ్చిన వాటాను కూడా ఉపయోగించలేకపోయింది. మనకు రావాల్సిన కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్కు పోతుంటే గత ప్రభుత్వం అలసత్వం వహించిందని వంశీచంద్‌రెడ్డి, తెలిపారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిట శ్రీహరి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, పర్నికా రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల ధనదాహార్తికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి వచ్చిందని, ఇంకా ఏ మొహంతో అక్కడికు వెళ్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, కుంగిపోయిన మేడిగడ్డ గురించి ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం మేడిగడ్డ పర్యటనకు వెళ్తే విమర్శలు చేసిన గులాబీ నేతలు, ఇప్పుడెలా వెళ్లారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, బీఆర్ఎస్ నేతల అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందన్నారు..