డైలీ భారత్, మహబూబాబాద్: ఇంటర్ పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐ.డి.ఓ.సి.లోని అదనపు కలెక్టర్ సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ నెల 28వ తేదీ నుండి మార్చి, 14వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలకు 19 థియరీ, 46 ప్రాక్టికల్ కేంద్రాలను ఏర్పాటు చేసామని, పరీక్షలకు
9546మంది జనరల్ కాగా, 8541 ప్రాక్టికల్స్ కు హాజరవుతున్నట్లు చెప్పారు.
ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్న పరీక్షలకు ఒక గంట ముందుగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ బస్ లను నడపాలన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు.
పరీక్షల నిర్వహణ సమయంలో జిరాక్స్ సెంటర్ లను బంద్ చేయించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా కు,
పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులు శానిటేషన్ కు చర్యలు తీసుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు.
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
పోలీస్ శాఖ బందోబస్తు చేపట్టాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మికంగా పర్యవేక్షిస్తుందన్నారు.
పోలీస్ శాఖ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా సిబ్బందితో ప్రశ్నపత్రాలు పరీక్ష కు అరగంట ముందుగా ఉదయం 8గంటలకు పరీక్షా కేంద్రాలకు అందించడం, జవాబుపత్రాలు ప్యాకింగ్ పటిష్టంగా చేపట్టి పోస్టల్ శాఖకు అందజేయాలన్నారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పాత్రల ప్యాకింగ్ జరగాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీ చెన్నయ్య,
విద్యాశాఖ అధికారి రామారావు, విద్యుత్ శాఖ అధికారి డి.ఈ. సునితదేవి , ఆర్టీసీ డి.ఎం.శివప్రసాద్, వైద్యశాఖ డాక్టర్ శ్రావణ్ కుమార్, పోస్టల్ శాఖ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు