రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో: మిషన్ భగీరథ నిబంధనలు సడలించాల్సిన పరిస్థితి ఉందని, స్థానిక సంస్థల్లో మిషన్ భగీరథ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ప్రత్యామ్నాయ చర్యల కోసం ఎలాంటి అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిందని వెంటనే వీటిని సడలించి స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,కేశంపెట్ జెడ్పిటిసి విశాల శ్రావణ రెడ్డి,నందిగామ ఎంపీపీ ప్రియాంక శివ శంకర్ గౌడ్, చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం ఒక డోల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అస్తమానం లీకేజీలు రిపేర్లు మరమ్మత్తులు ఇవే ఉంటాయని అన్నారు. ఒకచోట రిపేరు ఏర్పడితే 10 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోతుందని ఇదేమి మిషన్ భగీరథ అని అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్నో ప్రగల్బాలు పలికిందని మిషన్ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు సరిపోయినన్ని నీళ్లు సరఫరా చేస్తామని చెప్పి ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే వాస్తవాలు అర్థం అవుతాయని విమర్శించారు. కొత్తూరు మున్సిపాలిటీకి చాలాకాలంగా మిషన్ భగీరథ నీరు అందడం లేదని అసలు వీటి నిర్వహణ పద్ధతులు సక్రమంగా ఎలా నిర్వహిస్తారో ఎవరికీ అర్థం కాలేదని నిలదీశారు. మిషన్ భగీరథ ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే స్థానిక సంస్థల్లో స్వతహాగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు ఉండాలని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నీటి ఎద్దడి నివారణకు బోర్లు వేసుకోవాలన్నా, పైప్ లైన్లు వేసుకోవాలన్నా అనేక నిబంధనలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం మిషన్ భగీరథ పైనే ఆధారపడితే సరిగ్గా నీళ్ళు అందే అవకాశాలు ఉండవని పేర్కొన్నారు. మిషన్ భగీరథ వ్యవహారాల్లో అధికారులు ప్రత్యామ్నాయ ఆదేశాలతో పాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గం భూగర్భ జలాలపై ఆధారపడి ఉందని, అయితె ప్రస్తుతం మిషన్ భగీరథ పై ప్రజలు ఆధారపడ్డారని ఈ పథకం వల్ల సమస్యలు ఏర్పడుతుండడంతో ప్రత్యామ్నాయ చర్యల కోసం అధికారులు ముందుకు రావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.
#rangareddy #telangana