ఉద్యమకారుల గుండెలపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎంగా ఉన్నారు : హరీశ్ రావు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం షాద్‌నగర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ పోరాటంలో షాద్‌నగర్ ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా ఉద్యమంలో ముందునిలిచి పోరాడారని పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు.
కానీ, నేడు తెలంగాణ ఉద్యమ కారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తి సీఎంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరఫున కొట్లాడుదామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీనే తెలంగాణకు రక్ష అని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.కనీసం ఇక్కడ మనకు ఎంపీ అయినా ఉండాలి. మనకి ఏదైనా సమస్యవస్తే ఎంపీ వచ్చి మనకు తోడుగా ఉంటాడు. అందుకు అందరూ కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్నగర్లో గులాబీ జెండా ఎగురవేయాల్సిందే దానికి అందరు కార్యకర్తలు సిద్ధం అవ్వండి . అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ను వదిలిపెట్టమని అన్నారు. కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయాలని వారందరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి దిల్లీని కదిలించి తెలంగాణను సాధించారని తెలిపారు.కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ఈ నాలుగు ప్రాజెక్టుల్లో 30 ఏళ్లలో ఉమ్మడి మహబూబ్నగర్లో కాంగ్రెస్ 27,300 ఎకరాలకు నీరు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,36,000 ఎకరాలకు నీరు అందించాం. కల్వకుర్తి పంపుహౌస్లో పడుకుని వారితో పనులు చేయించాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయ్యాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వలా నారాయణ్ పేట్లో మెడికల్ కాలేజీలు వచ్చినాయంటే బీఆర్ఎస్ వచ్చాకనే వచ్చాయి అని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్,శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, రంగారెడ్డి జెడ్పి వైస్ చైర్మన్ ఈట గణేష్, షాద్ నగర్ మునిసిపల్ ఛైర్మెన్ కొందుటి నరేందర్,వైస్ చైర్మన్ నటరాజన్ ,మాజీ చైర్మెన్ అగ్గునురు విశ్వం, బిఅర్ఎస్ యువ నాయకులు మురళి యాదవ్, విరేశ్ గుప్తా, తల్లా ప్రశాంత్ , రాజశేఖర్, శ్రీకాంత్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపిటీసీలు,బిఅర్ఎస్ నాయకులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.