| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన! డ్రగ్స్ పై ఉక్కుపాదం, సైబర్ నేరాలపై హెచ్చరిక!

కామారెడ్డిలో డీజీపీ సి.వి. ఆనంద్ పర్యటన! డ్రగ్స్ పై ఉక్కుపాదం, సైబర్ నేరాలపై హెచ్చరిక!

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ పర్యటించారు. శాంతిభద్రతలు, పోలీస్ శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

శుక్రవారం 27.11.2026 న జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న డీజీపీకి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఐఏఎస్ పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.

తదుపరి జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు, సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, డీఎస్పీలతో డీజీపీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా పోలీస్ శాఖ పనితీరు, స్థితిగతులను వివరించారు. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణ, ముఖ్యమైన కేసుల పురోగతి, ఆపరేషన్ కవాచ్ ప్రత్యేక చర్యలు, ప్రజలకు అందిస్తున్న పారదర్శక పోలీస్ సేవలు, జిల్లా ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు పరిష్కార మార్గాలను సమగ్రంగా తెలియజేశారు. అనంతరం ఎస్ సీఆర్ బీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఈగల్ టీమ్ అధికారులు తమ తమ విభాగాలలో జిల్లా పనితీరును క్లుప్తంగా వివరించారు.

ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ మాట్లాడుతూ సుమారు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కామారెడ్డి జిల్లాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. గతంలో తాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా SP గా పనిచేసిన సమయంలో ఉన్న పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. గతంలో నక్సలిజం, మావోయిస్టుల సంచారం, క్లేమోర్ మైన్లు, ల్యాండ్ మైన్ల భయం వంటి సవాళ్లు ఉండేవని, నేడు ప్రభుత్వ పటిష్టమైన చర్యలు, పోలీసుల సమష్టి కృషితో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించగలిగామని తెలిపారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నాయకత్వంలో కామారెడ్డి జిల్లా పోలీస్ బృందం ఆపరేషన్ కవాచ్ వంటి పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల గ్యాంగ్ లు, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ చేస్తున్నారని, సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని డీజీపీ ప్రశంసించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై చర్యలు, నేరస్తులు, హిస్టరీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచుతూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆస్తి సంబంధిత నేరాలను సమర్థవంతంగా అరికడుతున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో జాతీయ రహదారులు అధికంగా ఉన్నందున రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆపరేషన్ కవాచ్ చెక్ పోస్టుల ద్వారా అంతర్రాష్ట్ర ముఠాలను అడ్డుకోవడంతో పాటు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టే చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు.

మాదకద్రవ్యాల సమస్య దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిందని, యువతను ఈ మహమ్మారి నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొంటూ 2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో సమన్వయం చేసుకుంటూ మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, విద్యార్థులు మరియు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సైబర్ నేరాల నియంత్రణలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని డీజీపీ తెలిపారు. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్ మోసాల ద్వారా దోచుకుంటున్నారని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల్లో ప్రత్యేక సైబర్ యూనిట్ల ద్వారా బాధితులకు వేగంగా న్యాయం అందిస్తున్నామని, సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు సూచించారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పనితీరును నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ర్యాంకింగ్స్ కేటాయించాలని, వెనుకబడిన స్టేషన్ల పనితీరు మెరుగుపడేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీజీపీ దిశానిర్దేశం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, బ్యాక్ వర్డ్ మరియు ఫార్వర్డ్ పద్దతుల ద్వారా నేరాల మూలాలను గుర్తించాలని తెలిపారు. గణేష్ నవరాత్రులు, దసరా, బతుకమ్మ, దీపావళి, మొహర్రం వంటి పండుగల సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీస్ సిబ్బందిని అభినందించారు.

నిరంతరం విధుల ఒత్తిడిలో పనిచేసే పోలీస్ అధికారులు, సిబ్బంది తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ సూచించారు. తెలంగాణ పోలీస్ అకాడమీ TGPA లో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మల్టీ జోన్ 1 ఐజీపీ కార్తికేయ, ఐపీఎస్, జోన్ III ఇన్ చార్జ్ డీఐజీ సున్ ప్రీత్ సింగ్, ఐపీఎస్, హైదరాబాద్ సీఐడీ డీఐజీ కె. నారాయణ నాయక్, ఐపీఎస్, సీఐడీ, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, ఎస్పీ సీఐడీ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్ధన్, ఐపీఎస్, ఈగల్ ఫోర్స్ ఎస్పీ ఈస్ట్ ఆర్. గిరిధర్, ఐపీఎస్ తో పాటు జిల్లాలోని పోలీస్ అధికారులు అందరూ పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు:

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం

సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేయాలి

బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం

నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం

ఇతర రాష్ట్రాల గ్యాంగ్ లు, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ కొరకు ఆపరేషన్ కవాచ్ ఏర్పాటు

కామారెడ్డి పోలీసుల సమష్టి కృషికి డీజీపీ అభినందనలు

#DailyBharath #DGP #CVAnand #Kamareddy

Previous కామారెడ్డిలో రోటరీ క్లబ్ సేవ! అంగన్వాడీ కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ల పంపిణీ!
Next రాష్ట్రవ్యాప్తంగా పోస్ట్ కార్డు ఉద్యమం విజయవంతం
ADVERTISEMENT