| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దొంగతనం, గంజాయి విక్రయం కేసులు ఛేదించిన కోదాడ పోలీసులు! ముగ్గురు నిందితుల అరెస్ట్!

దొంగతనం, గంజాయి విక్రయం కేసులు ఛేదించిన కోదాడ పోలీసులు! ముగ్గురు నిందితుల అరెస్ట్!

డైలీ భారత్, సూర్యాపేట: కోదాడ పట్టణంలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన కేసుతో పాటు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును కోదాడ టౌన్ పోలీసులు ఛేదించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు దర్యాప్తు, స్వాధీనం, నిందితుల అరెస్ట్ వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ వెల్లడించారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి మొత్తం 6.2 కిలోల గంజాయి, రూ.15 లక్షల విలువైన 9.150 తులాల బంగారు ఆభరణాలు, 12.3 తులాల వెండి పట్టా గొలుసులు, రూ.16 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

కేసు వివరాలు:

కోదాడ పట్టణానికి చెందిన షేక్ మస్తాన్, సొంటి సందీప్ అలియాస్ నటరాజ్, ఆలేటి గోపి గత కొంతకాలంగా స్నేహితులుగా ఉంటూ మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమ వ్యక్తిగత ఖర్చుల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ, ఆ డబ్బుతో భద్రాచలం ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి కోదాడ పట్టణం, పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో గత అక్టోబర్ 20న దసరా పండుగ రోజున రాత్రి బంజారా కాలనీలోని ఓ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించి, ఇనుప రాడ్ తో ఇంటి తాళం పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు. ఈ ఘటనపై కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

దొంగిలించిన బంగారు ఆభరణాల్లో రెండు హారాలను ఖమ్మంలోని గౌతమ్ బుద్ధ A to Z, సాయి సద్గురు జువెలరీ దుకాణాల్లో విక్రయించి రూ.3.60 లక్షలు, రూ.2.65 లక్షలు పొందారు. ఈ విక్రయాల్లో సహకరించిన బచ్చలకూరి పవన్ కు కమిషన్ రూపంలో రూ.40 వేల నగదు ఇచ్చారు. వచ్చిన డబ్బును మద్యం, జూదం, క్యాసినో బెట్టింగ్ లు, గోవా పర్యటనలు తదితర వ్యక్తిగత ఖర్చులకు వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం మిగిలిన డబ్బుతో సందీప్, మస్తాన్ కలిసి భద్రాచలం ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి సుమారు 8 కిలోల గంజాయిని రూ.40 వేలతో కొనుగోలు చేశారు. చెరో నాలుగు కిలోల చొప్పున తీసుకొని విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో నవంబర్ 19న బాలాజీనగర్ శివారులోని ఈనాడు పుల్లయ్య వెంచర్ వద్ద సుమారు 4 కిలోల గంజాయితో ఉన్న షేక్ మస్తాన్ ను పోలీసులు అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ అరెస్ట్ విషయం తెలుసుకున్న సందీప్ హైదరాబాద్ కు వెళ్లి తన మొబైల్ ఫోన్ ను గుర్తుతెలియని వ్యక్తికి విక్రయించాడు. తన వద్ద ఉన్న గంజాయిలో కొంత విక్రయించి, కొంత వినియోగించుకొని మిగిలిన 2.2 కిలోల గంజాయిని కోదాడకు తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు.

పటిష్ట నిఘా ఉంచిన కోదాడ పట్టణ పోలీసులు ఈ నేపథ్యంలో నవంబర్ 27న సాయంత్రం కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం డేగ బాబు ఫంక్షన్ హాల్ సమీపంలో చెట్ల వద్ద గంజాయితో ఉన్న సొంటి సందీప్, ఆలేటి గోపిని కోదాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సందీప్ ఇచ్చిన సమాచారం మేరకు దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఖమ్మంలోని నగల దుకాణాల్లో విక్రయించిన ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు:

గంజాయి: మొత్తం 6.2 కిలోలు

బంగారు ఆభరణాలు: 9.150 తులాలు

వెండి పట్టా గొలుసులు: 12.3 తులాలు

నగదు: రూ.16,000

ఒక మొబైల్ ఫోన్

ఈ కేసులో ఇప్పటికే షేక్ మస్తాన్ ను నవంబర్ 19న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన నిందితులను కూడా రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన కోదాడ టౌన్ సీఐ కె. శివశంకర్, ఎస్ ఐలు అజయ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు రాంబాబు, వెంకటేశ్వర్లు, లోకేష్, నవీన్, సందీప్ రెడ్డి, ఇన్నారెడ్డి, శ్రీనివాస రెడ్డిలను జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసరెడ్డి, ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్ఐ అజయ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.

#DailyBharath #Suryapet #Kodad #Police

Previous అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొట్టాం జయరాం ఎన్నిక!
Next అండం అక్రమ రవాణా రాకెట్ పై మల్కాజ్ గిరి పోలీసుల భారీ దాడి! ఒయాసిస్ ఫెర్టిలిటీ సీనియర్ అధికారులు ఇద్దరు అరెస్ట్!
ADVERTISEMENT