డైలీ భారత్, నిర్మల్: భైంసా మున్సిపాలిటీలో అవినీతి బాగోతం బయటపడింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్‌చార్జ్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పెండింగ్ బిల్లు విడుదల కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.50,000 లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
లంచం డిమాండ్ ఎలా?
ఫిర్యాదుదారుడు భైంసా మున్సిపాలిటీలో సివిల్ పనులు చేశాడు. అతనికి రావాల్సిన రూ.2.63 లక్షల పెండింగ్ పేమెంట్ చెక్ విడుదల కోసం అధికారి రూ.50,000 లంచం డిమాండ్ చేశాడు.
ఇంతకుముందు అక్టోబర్ 26న రూ.10,000 లంచం తీసుకొని రూ.6.40 లక్షల చెక్ విడుదల చేశాడు. మిగిలిన రూ.2.63 లక్షల చెల్లింపు కోసం మళ్లీ రూ.50,000 డిమాండ్ చేశాడు.
కారు డ్యాష్‌బోర్డులో డబ్బు!
నవంబర్ 10న ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. అతని కారు డ్యాష్‌బోర్డులో నుంచి లంచం డబ్బును స్వాధీనం చేసుకున్నారు. డ్యాష్‌బోర్డుపై చేసిన కెమికల్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చింది.
అధికార దుర్వినియోగం
తన అధికార పదవిని దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందినట్లు ఏసీబీ తెలిపింది. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని స్పెషల్ జడ్జి ఫర్ SPE, ACB కేసుల కోర్టు ముందు జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరచనున్నారు.
కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో వెల్లడించలేదు.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ కోరింది.
#DailyBharath #Bhainsa #Nirmal #ACB #Corruption #Telangana #Bribe