డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మెండోరా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, టాయిలెట్లు, తరగతి గదులను పరిశీలించారు. స్టోర్ రూంలో నిలువ ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను గమనించారు. ఎఫ్.ఆర్.ఎస్ యాప్ ద్వారా సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనం మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెనూలో పేర్కొన్న క్యారెట్ కర్రీకి బదులుగా ఆలూ కర్రీ వండడాన్ని గమనించిన కలెక్టర్, నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో డైట్ మెనూ రూపొందించిందని, దానిని పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే ప్రయోజనం ఏమిటని మందలించారు. అనంతరం 6వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బహుమతులను అందించి చిన్నారులను ప్రోత్సహించారు.
News
కస్తూర్బా బాలికల విద్యాలయంను తనిఖీ చేసిన కలెక్టర్... సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ మండిపాటు