ఈడీ భారీ షాక్! రూ.18.33 కోట్ల ఆస్తులు జప్తు! కల్లం పెరి రెడ్డి బ్యాంక్ స్కామ్ బయటపడింది!
డైలీ భారత్, విశాఖపట్నం:ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విశాఖపట్నం సబ్-జోనల్ కార్యాలయం భారీ చర్యకు దిగింది. కల్లం మోడరన్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో కల్లం పెరి రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులు / అనుచరులకు చెందిన రూ. 18.33 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002 (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు 10-11-2026 నాడు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో ఈడీ వెల్లడించింది.
కేసు ఎలా మొదలైంది?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ, EOW, చెన్నై నమోదు చేసిన FIR ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఫిర్యాదులో కల్లం మోడరన్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ రామబ్రహ్మ మోడరన్ రైస్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ శ్రీ వినాయక ట్రేడర్స్ మరియు ఇతరుల పేర్లు ఉన్నాయి.
రూ.24.57 కోట్ల రుణం - నకిలీ పత్రాలు!
2010-2013 మధ్య కాలంలో ఈ గ్రూప్, గుంటూరులోని అరుండల్‌పేట బ్రాంచ్‌లోని SBH నుండి రూ. 24.57 కోట్ల క్రెడిట్ సౌకర్యాలు పొందింది. అందుకు తాకట్టు ఆస్తులకు సంబంధించి నకిలీ / ఫోర్జరీ టైటిల్ డీడ్లు సమర్పించారు. ఆ నిధులను దారి మళ్లించి బ్యాంకుకు రూ. 18.33 కోట్ల నష్టం కలిగించారు.
26 కంపెనీలతో మాయాజాలం!
దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. కల్లం పెరి రెడ్డి తన బంధువులు, ఉద్యోగులు, అనుచరుల పేర్లతో సుమారు 26 సంస్థలను నిర్వహించాడు. వాటిలో పైన పేర్కొన్న మూడు రుణగ్రహీత సంస్థలు కూడా ఉన్నాయి.
బ్యాంక్ ఖాతాల విశ్లేషణలో మరో షాకింగ్ విషయం తేలింది. మూడు రుణగ్రహీత సంస్థల క్యాష్ క్రెడిట్ ఖాతాల నుండి సుమారు రూ. 23.81 కోట్ల నగదు - కార్మికులు, అకౌంటెంట్లు మరియు కల్లం పెరి రెడ్డి పేర్లతో విత్‌డ్రా చేయబడింది.
లోన్ డబ్బుతో ఆస్తులు - బినామీ పేర్లతో బదిలీ!
మరింత దర్యాప్తులో, రుణం నుంచి వచ్చిన డబ్బులో కొంత భాగంతో అనేక ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. కల్లం పెరి రెడ్డి తనకు చెందిన కొన్ని స్థిరాస్తులను ఎటువంటి అమ్మకపు ప్రతిఫలం (Sale Consideration) లేకుండానే తన బంధువులు, అనుచరులకు బదిలీ చేశాడు. ఆ ఆస్తులు కేవలం వారి పేర్ల మీద మాత్రమే ఉన్నాయి, అసలు లబ్ధిదారుడు మాత్రం పెరి రెడ్డే కొనసాగాడు.
ఈడీ ఏం జప్తు చేసింది?
దీంతో ఈడీ, PMLA, 2002 కింద Proceeds of Crime గా లేదా దానికి సమాన విలువగా:
- 50 స్థిరాస్తులు - విలువ రూ. 16.88 కోట్లు
- 5 ఫ్లాట్లు - విలువ రూ. 1.45 కోట్లు
-మొత్తం రూ. 18.33 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నవి, అటాచ్ చేసింది.
తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది.
#DailyBharath #ED #KallamPeriReddy #RiceMillsScam #MoneyLaundering #Guntur #Visakhapatnam