| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మైనర్ పై వేధింపులు... నిందితుడికి 20 ఏళ్ల జైలు! సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు!

మైనర్ పై వేధింపులు... నిందితుడికి 20 ఏళ్ల జైలు! సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు!

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో సిరిసిల్ల పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష*

 తో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

బాలికకు రూ.30,000 పరిహారం:

బాధిత మైనర్ బాలికకు రూ.30,000 పరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

కేసు వివరాలు:

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన ముద్రకోల చరణ్ అనే వ్యక్తి సిరిసిల్ల పట్టణానికి చెందిన ఒక మైనర్ అమ్మాయితో పరిచయం పెంచుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు అనంతరం డీఎస్పీ నాగేంద్రచారి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

కోర్టు విచారణలో భాగంగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ శ్రవణ్ యాదవ్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సి వాదించారు. ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

బాలికలు నిర్భయంగా పోలీసులను సంప్రదించండి - ఎస్పీ:

మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ తెలిపారు. మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులకు గురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. నేరాలకు పాల్పడిన వారు ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన ప్రాసిక్యూషన్ సమన్వయంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ వీరప్రసాద్, ఎస్.ఐ శ్రావణ్ యాదవ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఝాన్సి, కోర్టు కానిస్టేబుల్ మహేందర్, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్స్ నవీన్, వెన్నెల, భరోసా లీగల్ సపోర్ట్ పర్సన్ లహరికలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

#డైలీభారత్ #RajannaSircilla #POCSO #Vemulawada #DailyBharath

Previous నిజామాబాద్‌లో దారుణం... పోలీస్ స్టేషన్ ఎదుటే కత్తులతో వీరంగం! జిల్లా వ్యాప్తంగా కలకలం!
Next నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
ADVERTISEMENT