| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో రైతాంగానికి బాసటగా నిలువాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో రైతాంగానికి బాసటగా నిలువాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

బ్యాంకర్లతో సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

డైలీ భారత్, నిజామాబాద్: ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో జిల్లా రైతాంగానికి బ్యాంకర్లు బాసటగా నిలువాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఎల్ నినో వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో పంట రుణాల రీషెడ్యూల్, రైతులకు బ్యాంకుల ద్వారా అందించాల్సిన ఆర్థిక సహాయంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎస్.ఎల్.బీ.సీ జారీ చేసిన తాజా మార్గదర్శకాల మేరకు జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా బ్యాంకర్లు చొరవ చూపాలన్నారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుత ప్రతీకూల పరిస్థితుల్లో రైతులకు బ్యాంకర్లు బాసటగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బ్యాంకర్లతో సమన్వయము పెంపొందించుకుని అర్హులైన రైతులకు సకాలంలో రుణాల రీషెడ్యూల్, కొత్త రుణాల పంపిణీ, అవసరమైన సహకారం అందేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వంచే గుర్తించబడిన జిల్లాలోని 18 సాధారణ కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు పంట రుణాలను ఎస్.ఎల్.బీ.సీ మార్గదర్శకాల ప్రకారం రీషెడ్యూల్ చేసి, 12 నెలల మారటోరియం కల్పించాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు కొత్తగా పంట రుణాలు సకాలంలో అందజేసి, వారికి అండగా నిలవాలని సూచించారు. వర్షాభావం దృష్ట్యా యాసంగిలో వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచించడం జరిగిందన్నారు.  దీనివల్ల పాడి పశువుల ద్వారా రైతులు కరువు ప్రభావం నుండి కొంతవరకు బయటపడేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం సాధారణ కరువు ప్రాంతాలుగా గుర్తించిన జిల్లాలోని 18 మండలాలకే పరిమితం కాకుండా, ఇతర మండలాల్లో కూడా కరువు ప్రభావానికి గురైన రైతులు ఉన్నట్లయితే, వ్యవసాయ శాఖ అధికారులు వారిని గుర్తించి వివరాలు సమర్పించిన పక్షంలో, నిబంధనల ప్రకారం వారికి కూడా రుణాల రీషెడ్యూల్ ప్రయోజనాలు వర్తించేలా బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ హితవు పలికారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్.బీ.ఐ ప్రతినిధి రాములు, నాబార్డు డీ.డీ.ఎం ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, వ్యవసాయ శాఖ ఏడీ వీరస్వామి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే.రాజు, అన్ని బ్యాంకుల జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Previous నిబంధనల మేరకే ఇసుక రవాణాకు అనుమతులు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next షూటింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించిన హెచ్‌జీ స్వామి కుమార్తె అక్షిత
ADVERTISEMENT