డైలీ భారత్, సిరిసిల్ల:కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకొని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ సూచించారు.
ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జయప్రకాశ్ నగర్‌లోని కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ కార్మికులు తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
కార్మికుల్లో కొంతమంది తంబాకు, బీడీ, మద్యపానం, అధిక టీ వంటి అలవాట్లకు గురవుతున్నారని, పని ఒత్తిడి, ఆందోళన, వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలను ఎదుర్కొనే క్రమంలో కొందరు ఇటువంటి అలవాట్లను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించినప్పటికీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
అలాగే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని తెలిపారు.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, సమతుల్య ఆహారం, తగిన శారీరక వ్యాయామం, తగినంత నిద్ర, పొగాకు మరియు మద్యపానానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కుటుంబ కలహాలు, దురలవాట్లు, ఆందోళన తదితర సమస్యలకు ప్రతిరోజూ కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నామని పున్నంచందర్ తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.