డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని బీడీ కాలనీలో చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి KRK సన్ షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నవంబర్ 15న సామాజిక సర్వే నిర్వహించారు!
ఈ సర్వేలో పిల్లల ఆరోగ్యం, విద్య, భద్రత, కుటుంబ పరిస్థితులు, కాలనీలోని మౌలిక సదుపాయాల కొరత వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి!
ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నవంబర్ 16న కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పిల్లల ప్రజావాణి కార్యక్రమానికి చిన్నారులను తీసుకెళ్లి, వారి సమస్యలను అధికారుల ఎదుట నేరుగా వివరించే అవకాశం కల్పించారు! చిన్నారులు తమ సమస్యలపై రాతపూర్వక వినతిపత్రాలను సంబంధిత శాఖల అధికారులకు సమర్పించారు!
చిన్నారులతో అధికారులు మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు! DCPO తో పాటు ఇతర అధికారులు సమస్యలపై స్పందిస్తూ, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు!
సర్వేలో వెలుగులోకి వచ్చిన ప్రధాన సమస్యలు:
1. చదువుకు దూరమవుతున్న పిల్లలు:
తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడం, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా మధ్యలోనే చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు! బాల కార్మికత్వాన్ని అరికట్టి, ఆ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలి!
2. ఆధార్ కార్డులు లేక విద్యకు ఆటంకం:
కొంతమంది పిల్లలకు ఆధార్ కార్డులు లేకపోవడం వల్ల పాఠశాలల్లో ప్రవేశం, ప్రభుత్వ పథకాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి! అర్హులైన పిల్లలకు ఆధార్ నమోదు, అవసరమైన ధ్రువపత్రాల విషయంలో అధికారులు సహకరించాలని కోరారు!
3. బాల్యవివాహాల సమస్య:
కాలనీలో చిన్న వయస్సులోనే బాలికలకు వివాహాలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు! దీనివల్ల బాలికల చదువు మధ్యలోనే ఆగిపోవడం, వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది! బాల్యవివాహాల నిరోధక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాలి!
4. మద్యం మత్తులో పిల్లలపై తండ్రుల వేధింపులు:
కొంతమంది తండ్రులు మద్యం సేవించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలను కొట్టడం, వేధించడం జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు! ఇలాంటి కుటుంబ పరిస్థితుల్లో పిల్లలు భయం, అభద్రత మధ్య జీవిస్తూ మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు! బాధిత పిల్లలకు రక్షణ, కౌన్సెలింగ్, అవసరమైన చట్టపరమైన సహాయం అందించాలని కోరారు!
5. మూడు నెలలుగా పనిచేయని కాలనీ బోర్ వెల్:
కాలనీలోని బోర్ వెల్ గత మూడు నెలలుగా పనిచేయడం లేదని స్థానికులు తెలిపారు! పలువురు అధికారులు, వార్డు కౌన్సిలర్లను సంప్రదించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదు! తాగునీటి కోసం చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది! వెంటనే బోర్ వెల్ మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు!
6. చెత్త పేరుకుపోవడంతో ఇళ్లలోకి వస్తున్న పాములు:
కాలనీలో చెత్తను క్రమం తప్పకుండా తొలగించకపోవడంతో అపరిశుభ్రత పెరిగి, పాములు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు! పాముకాటుకు గురైన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని వారు తెలిపారు! ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని, వెంటనే చెత్త తొలగింపు, పారిశుధ్య చర్యలు, పాముల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు!
7. సమీపంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం:
కాలనీకి సమీపంలో సెకండరీ స్థాయి వైద్య సేవలు అందించే ఆసుపత్రి లేకపోవడంతో అత్యవసర వైద్య అవసరాల సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు! చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి!
8. నివాస గృహాలు, మౌలిక సదుపాయాల కొరత:
కొన్ని కుటుంబాలు సరైన ఇళ్లు లేక గుడిసెల్లో నివసిస్తున్నాయి! తాగునీరు, విద్యుత్, రహదారులు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు సరిగా లేవని సర్వేలో గుర్తించారు! కాలనీలో చెత్త సేకరణ కూడా క్రమం తప్పకుండా జరగడం లేదని స్థానికులు తెలిపారు!
అధికారులకు KRK సన్ షైన్ చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి:
- పనిచేయని బోర్ వెల్ ను వెంటనే మరమ్మతు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలి!
- కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి!
- పాముల బెడద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి!
- పాఠశాల మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలి!
- ఆధార్ లేని పిల్లలకు ఆధార్ నమోదు చేయించేందుకు సహకరించాలి!
- బాల్యవివాహాలను అరికట్టి బాలికల విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి!
- గృహహింస, వేధింపులకు గురవుతున్న పిల్లలకు తగిన రక్షణ, కౌన్సెలింగ్ అందించాలి!
- చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి!
- ఇళ్లు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి!
KRK సన్ షైన్ చారిటబుల్ ట్రస్ట్ మాట్లాడుతూ, పిల్లల సమస్యలను గుర్తించడం మాత్రమే కాకుండా, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించే వరకు కృషి చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపింది! పిల్లలకు సురక్షితమైన బాల్యం, నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన జీవనం కల్పించేందుకు ట్రస్ట్ నిరంతరం పనిచేస్తుందని పేర్కొంది!
"ప్రతి చిన్నారి గొంతు వినబడాలి! ప్రతి సమస్యకు పరిష్కారం లభించాలి!"
#DailyBharath #Kamareddy #BidiColony #ChildRights #KRKSunshineTrust