డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లాలో వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా న్యాయవాదుల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరింది.
బుధవారం సీఎం జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవునూరి రమాకాంత్ రావు మాట్లాడుతూ - జిల్లా కేంద్రంలో 360 మందికి పైగా న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వీరిలో చాలా మందికి కనీస నివాస గృహాలు లేక సామాజిక, ఆర్థిక భద్రత లేకుండా వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు.
అర్హులైన న్యాయవాదులకు అనువైన ప్రాంతంలో నామమాత్రపు ధరలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, నిరంతర ఒత్తిడితో కూడిన వృత్తిలో ఉన్న న్యాయవాదుల కోసం హెల్త్ మరియు రిక్రియేషన్ క్లబ్ ఏర్పాటుకు 3 ఎకరాల స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కేంద్రానికి మంజూరైన ఫ్యామిలీ కోర్టు ఏర్పాటుకు త్వరితగతిన నిధులు మంజూరు చేసి, మౌలిక వసతులు, భవనం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చీకట్ల వెంకటయ్య, గోవర్ధన్ రెడ్డి, శనిగరం వసంతం, కిషన్ తదితరులు పాల్గొన్నారు.