డైలీ భారత్, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, డీఏలను రేపు జరగనున్న క్యాబినెట్ సమావేశంలోనే ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ.ఖాద్రీ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం, జేఏసీల మధ్య జరిగిన చర్చల ఒప్పందం ప్రకారం రెండు డీఏలకు ఉత్తర్వులు విడుదల చేస్తూ 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఉద్యోగుల హక్కులను హరించవద్దని ముఖ్యమంత్రిని సవినయంగా కోరుతున్నామన్నారు. 01-07-2023 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీకి 39 నెలలు గడిచినా అతీగతీ లేదని, డీఏ బకాయిలు 6కు చేరాయని, హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో అమలు కాకపోయినా జీతం నుంచి 1.5 శాతం కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారినా ఉద్యోగుల తలరాతలు మారడం లేదని, ఇప్పటికైనా మానవీయ కోణంలో ఆలోచించి పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగ విరమణ పొందిన రోజే అన్ని ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.