| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సెప్టెంబర్ 30న సిరిసిల్లకు సీఎం రేవంత్... సిరిసిల్ల గడ్డపైనే ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగించే సందేశం ఇస్తారు : మంత్రి పొన్నం ప్రభాకర్

సెప్టెంబర్ 30న సిరిసిల్లకు సీఎం రేవంత్... సిరిసిల్ల గడ్డపైనే ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగించే సందేశం ఇస్తారు : మంత్రి పొన్నం ప్రభాకర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు రానున్నారని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సిరిసిల్లలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, విజయ రమణ రావు, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, కెకె మహేందర్ రెడ్డి లతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నాయకత్వంలో 33 నెలలుగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం రైతాంగం, కార్మికులు, విద్యార్థుల సంక్షేమానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని అన్ని దిశలా అభివృద్ధి చేసే సంకల్పంతో ముందుకు పోతోందన్నారు.

ప్రతిపక్షాలు బాధ్యతగల రీతిలో ప్రవర్తించకుండా విచ్ఛిన్నకర విధానాలతో ముందుకు పోతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగినా, వర్షాలు పడకపోయినా సంతోషపడే వాతావరణం ఉందని ఎద్దేవా చేశారు.

ఎల్ నినో వల్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తేవాల్సిన సమయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు పడాలని పూజలు చేస్తుంటే వారు నెగటివ్ గా ఆలోచిస్తున్నారని అన్నారు.

సిరిసిల్ల వేదిక నుంచే ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలిగించేలా ముఖ్యమంత్రి ఒక సందేశం ఇవ్వనున్నారని తెలిపారు.

ఎంత పెద్ద ఆర్థిక భారం ఉన్నా ఒక్క రూపాయి కూడా చార్జీలు, విద్యుత్ చార్జీలు లేదా ఇతర పన్నుల భారం ప్రజలపై వేయకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

గత ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సబ్సిడీ, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, మహిళా సంఘాలకు 5-10 లక్షల వడ్డీలేని రుణాలు, నిరుద్యోగులకు దాదాపు 70 వేల ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.

సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పక్షాన, ఉమ్మడి జిల్లా పక్షాన ప్రతి ఒక్క కార్యకర్త ఈ సమావేశానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.

Previous రాజన్న సిరిసిల్ల రెడ్‌క్రాస్ సొసైటీ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
ADVERTISEMENT