డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ గొల్లిశెట్టి నాగు మృతిపై సమగ్ర ఉన్నత స్థాయి విచారణ జరపాలని తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు.
తుడుం దెబ్బ నాయకులు బండారి సూర్యనారాయణ మాట్లాడుతూ నాగు మృతికి కారణమైన పోలీసు అధికారులపై చట్టపరమైన, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుపై ఉన్నత స్థాయి కమిటీ లేదా ఐజీ స్థాయి అధికారితో పారదర్శక విచారణ చేపట్టాలని కోరారు.
నాగును వేధింపులకు గురిచేసిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, బలహీన వర్గాలపై జరుగుతున్న పోలీసు వేధింపులు, అక్రమ కేసుల నమోదును వెంటనే నిలిపివేయాలని కోరారు.
ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బండారి సూర్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి, వాసం పోలయ్య పాల్గొన్నారు.