డైలీ భారత్, కామారెడ్డి: ఈ దేశ ఆరోగ్య వ్యవస్థకు వెన్నుముక ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులేనని టాస్క్ జిల్లా కన్వీనర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు డాక్టర్ బాలు అన్నారు.
కామారెడ్డి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల JAC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. వారి న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, పేదలకు అన్నివేళలా అండగా ఉంటూ, ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా నిర్విరామంగా కృషి చేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలు, తగిన వేతనాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ ఆరోగ్య అభివృద్ధికి కారణమైన ఈ ఉద్యోగుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం సరికాదని, పోరాట బాట ద్వారానే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.