డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు KTR సిరిసిల్లను పట్టించుకోవడం లేదంటూ భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్‌కు బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ బహిరంగ లేఖ రాశారు.
2023 ఎన్నికల ప్రచారంలో సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి KTR చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు. "నన్ను గెలిపిస్తే వారానికి రెండు రోజులు సిరిసిల్లలోనే పడుకుంటా, మీ కష్టసుఖాల్లో తోడుంటా" అని KTR అప్పుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ఆ మాట విని సిరిసిల్ల జనం మురిసిపోయి ఓట్లు వేశారని, కానీ గెలిచి రెండున్నరేళ్లు అయినా ఆయన క్యాలెండర్‌లో "రెండు రోజులు" ఇంకా రాలేదని విమర్శించారు. "ఆయన లెక్క ప్రకారం ఈపాటికి కనీసం 260 రోజులు సిరిసిల్లలో బస చేయాలి. కానీ ఆయన ఖాతాలో ఉన్నది మాత్రం "సున్నా" అని లేఖలో పేర్కొన్నారు.
"ఒక్క రాత్రి కూడా సిరిసిల్ల గడ్డ మీద ఆయనకు కునుకు పట్టలేదు. మా ఊరి ప్రజలంటే గిట్టకనో, లేక ఇక్కడి గాలి పీల్చితే గ్రామర్ తగ్గుతుందనే భయమో తెలియదు" అని దుమాల శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.
సిరిసిల్లను ఒక నియోజకవర్గంగా కాకుండా "వీకెండ్ టూరిస్ట్ స్పాట్" లా KTR చూస్తున్నారని ఆరోపించారు. "అమాస, పున్నానికి ఒకసారి తన కార్ల కాన్వాయ్‌తో వస్తారు, కెమెరాలకు ఫోజులిస్తారు, ప్యాకప్ చేసి AC కారులో హైదరాబాద్ వెళ్లిపోతారు. ఇదే ఆయన తీరు. నియోజకవర్గంలో ఆయన విజిటింగ్స్ చూస్తుంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుడిలా కాకుండా "గెస్ట్ ఆర్టిస్ట్" వచ్చి పోతున్నట్లు ఉంది" అని లేఖలో పేర్కొన్నారు.
"గెలిచాక జనాన్ని గాలికొదిలేసి, నియోజకవర్గాన్ని పిక్నిక్ స్పాట్‌గా భావిస్తున్న" KTRకు ప్రజల గోడు ఎలాగూ పట్టదని, కనీసం అంబేద్కర్ మీరైనా కల్పించుకొని "ఇది ఆయన సొంత నియోజకవర్గమని" గుర్తు చేసి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేలా సేవలు అందించలని లేఖలో కోరారు.
విన్నపంతోనే ఆపకుండా KTR పర్యాటక యాత్రలు ఆపి, ఇచ్చిన మాట ప్రకారం సిరిసిల్లలో బస చేసి ప్రజల సమస్యలు వినాలని సిరిసిల్ల ప్రజల పక్షాన విజ్ఞప్తి చేశారు.