డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూరు: జిల్లాలోని పెద్దూరు గ్రామంలో తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒక కూలీ సజీవంగా దహనమయ్యాడు.
మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ & గోదాంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లో పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీ మహమ్మద్ ఇస్లాం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
నిద్రలోనే ప్రమాదం
సమాచారం ప్రకారం షాపులో మొత్తం నలుగురు కూలీలు నిద్రిస్తున్నారు. మంటలు చెలరేగడంతో ముగ్గురు ఎలాగోలా బయటకు పరుగెత్తి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే మహమ్మద్ ఇస్లాం మాత్రం మంటల్లో చిక్కుకుని దుర్మరణం పాలయ్యాడు.
45 లక్షల వరకు నష్టం?
ఈ అగ్నిప్రమాదంలో ఫర్నిచర్ సామాగ్రి, గోదాంలోని మొత్తం స్టాక్ పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ. 40 నుండి 45 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాపు యజమాని తెలిపారు. "అప్పులు చేసి, లోన్లు తీసుకొని ఈ షాప్‌ను నడుపుతున్నాను. ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి" అంటూ ఆయన రోదించారు.
పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సీఐ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానా లేక ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో పెద్దూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబానికి సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది