డైలీ భారత్, లక్ష్మీదేవిపల్లి: ప్రతిభకు ప్రాంతం అడ్డుకాదని మరోసారి రుజువైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల పెద్దతండాకు చెందిన భూక్య తేజస్విని దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ IIMలో సీటు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి విద్యాసంస్థలో ప్రవేశం పొందడం ఆమె క్రమశిక్షణకు, పట్టుదలకు నిదర్శనమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
NSUI ఆధ్వర్యంలో ఘన సన్మానం
తేజస్విని విజయాన్ని గుర్తించి ఎన్.ఎస్.యు.ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తేజస్విని సాధించిన విజయం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదని, ఇది మొత్తం తండా, మండలం, జిల్లా విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విజయమని అన్నారు.
"పోటీ ప్రపంచంలో నిలవాలంటే కష్టం, క్రమశిక్షణ చాలా అవసరం. తేజస్విని ఆ దిశగా అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రతిభ ఉంటే గ్రామీణ విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో రాణించగలరని ఆమె చాటి చెప్పింది" అని సురేష్ నాయక్ పేర్కొన్నారు.
తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని, భవిష్యత్తులో తేజస్విని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో NSUI నాయకులు, విద్యార్థులు, యువకులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని తేజస్వినికి శుభాకాంక్షలు తెలిపారు.