డైలీ భారత్, ఖమ్మం (వైరా):ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగుచూసింది. ఓ 11 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారయత్నానికి పాల్పడిన ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన వైరా ఇన్ఛార్జ్ గౌరవరపు జగదీష్ (డేవిడ్ రాజ్) పై పోలీసులు కేసు నమోదు చేశారు.
లెక్కలు చెబుతానని నమ్మించి..
పోలీసుల కథనం ప్రకారం.. శనివారం (ఆగస్టు 8) నాడు నిందితుడు జగదీష్ మద్యం మత్తులో ఆరో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అతను, బాలికకు లెక్కలు (మాథ్స్) చెబుతానంటూ లోపలికి ప్రవేశించాడు. అనంతరం బాలికపై తీవ్రంగా లైంగిక వేధింపులకు దిగి, లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. పోక్సో కేసు నమోదు
నిందితుడి ప్రవర్తనతో తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ ఏడ్చింది. అనంతరం ఈ విషయాన్ని తన తల్లికి వివరించింది. బాధితురాలి తల్లి వెంటనే వైరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు గౌరవరపు జగదీష్‌పై పోక్సో (POCSO) చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వైరా పోలీసులు వెల్లడించారు. రాజకీయ రంగు ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.