Posted on 2026-07-29 18:33:08
వృద్ధ మహిళలే లక్ష్యంగా చెలరేగిన అంతర్రాష్ట్ర దొంగలు
ముగ్గురు నిందితుల అరెస్ట్.. 8 తులాల బంగారం, కత్తులు, బైక్ సీజ్
నకిలీ చిరునామాలు అడుగుతూ అందినకాడికి దోపిడీ
షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన ఫ్యూచర్ సిటీ సీపీ డా. తరుణ్ జోషి
మరో చోరీ కేసులో 18 తులాల బంగారం, 7 తులాల వెండి స్వాధీనం
డైలీ భారత్, షాద్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో వరి కోత మిషన్ల ఆపరేటర్లుగా వచ్చి, ఒంటరిగా వెళ్తున్న వృద్ధ మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను కేశంపేట్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఈ కేసు వివరాలను వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం, నిజామాబాద్ పోలీసుల సహకారంతో ఈ ముఠా గుట్టురట్టు చేసినట్లు ఆయన తెలిపారు.
పక్కా ప్లాన్‌తో దొంగతనాలు.. నిందితులు వీరే..
పంజాబ్ రాష్ట్రానికి చెందిన సుఖ్‌దేవ్ సింగ్ (38), షంషేర్ సింగ్ (36), మనుప్రీత్ సింగ్ (24) ముఠాగా ఏర్పడ్డారు. వీరు పంటల సీజన్‌లో హార్వెస్టర్ మిషన్ ఆపరేటర్లుగా పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సంచరించేవారు. ఈ క్రమంలో స్థానిక రహదారులు, తప్పించుకునే మార్గాలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు. కేశంపేట్ మండలంలోని సంతాపూర్, మక్తమాదారం తదితర ప్రాంతాల్లో కూలి పనులకు కాలినడకన వెళ్తున్న వృద్ధ మహిళల వద్దకు బైక్‌పై వెళ్లి దారి అడిగినట్లు నటిస్తూ.. అమాంతం వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లి ఉడాయించేవారు. మరో ఘటనలో ఓ మహిళను కిందకు తోసివేసి మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించారు.
కొత్తకోట టు కేశంపేట్.. నేరాల పరంపర
ఈ ముఠా ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఒక మోటార్‌సైకిల్ దొంగిలించి, అదే వాహనంతో గొలుసు దొంగతనానికి పాల్పడింది. అనంతరం ఈ ముగ్గురు నాందేడ్‌లో కలుసుకుని తెలంగాణలో మరిన్ని నేరాలకు కుట్ర పన్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రైలులో వచ్చి, బైక్ చోరీ చేసి కేశంపేట్, కడ్తాల్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. మరో నేరానికి సిద్ధమవుతున్న సమయంలో పక్కా సమాచారంతో కేశంపేట్ క్రాస్‌రోడ్ వద్ద పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
సీజ్ చేసిన వస్తువులు ఇవే..
పట్టుబడిన నిందితుల నుంచి సుమారు 8 తులాల బరువున్న రెండు బంగారు మంగళసూత్రాలు, ఒక మోటార్‌సైకిల్ (TS 06 FC 2338), 5 మొబైల్ ఫోన్లు, రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
షాద్‌నగర్ పోలీసుల మరో విజయం
ఇదే సమావేశంలో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన "హెచ్‌బీ బై నైట్" (రాత్రి వేళ ఇళ్లలో చోరీ) కేసును కూడా ఛేదించినట్లు సీపీ తరుణ్ జోషి తెలిపారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 18 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు వాహన చోరీ కేసులను ఛేదించి మూడు మోటార్‌సైకిళ్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు.
పోలీసులకు సహకరించండి: సీపీ
ప్రజలు ఆస్తి సంబంధిత నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. ప్రతి కాలనీలో, వీధుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులను విజయవంతంగా ఛేదించిన డీసీపీ శిరీష రాఘవేందర్, షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, కేశంపేట్ సీఐ నరహరి, ఎస్సై రాజ్ కుమార్, క్రైమ్ టీం మరియు కేశంపేట్ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >