Posted on 2026-07-26 10:51:59
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన "ఇందిరమ్మ టవర్స్" ఇళ్ల కేటాయింపు పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి రూ.10,000 ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో, సైబర్ నేరగాళ్లు నకిలీ కాల్స్, అపరిచిత లింకులతో బురిడీ కొట్టించే ప్రమాదముందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు తావులేదని, ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిబంధనల ప్రకారం చెల్లించిన ఈఎండీ సొమ్ము భద్రంగా ఉంటుందని, ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు. "డబ్బులు చెల్లిస్తే ఇల్లు కచ్చితంగా ఇప్పిస్తాం" అని నమ్మించే వారి మాటలు నమ్మవద్దని సూచించారు. "ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది" అని భయపెట్టి, తొందరపాటులో నగదు బదిలీ చేయించుకోవడం నేరగాళ్ల ప్రధాన ఎత్తుగడ అని హెచ్చరించారు.
వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే అపరిచిత లింకులను నమ్మి ఏపీకే ఫైళ్లను ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసగించే అవకాశం ఉందన్నారు. గైడ్ చేస్తామనే నెపంతో "ఎనీడెస్క్", "టీమ్‌వ్యూర్" వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేస్తారని పేర్కొన్నారు. యూపీఐ పిన్ అనేది కేవలం డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, రీఫండ్ సొమ్మును స్వీకరించడానికి పిన్ నంబర్ నొక్కాల్సిన అవసరం లేదనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు. అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డుల ఫొటోలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు పంపకూడదని హితవు పలికారు.
ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా "040-24603572" అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, తక్షణమే పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >