| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్-2026 కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, నగరం నలుమూలల నుంచి ఒలింపిక్ జ్యోతిని తీసుకువచ్చిన ప్రతి క్రీడాకారుడికి అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఒలింపిక్ స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఒలింపిక్ డే రన్ కేవలం క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. క్రమశిక్షణతో కూడిన క్రీడాకారులే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని, మిలిటరీ సైనికులకు ఉన్నంత క్రమశిక్షణ క్రీడాకారులకు కూడా ఉండాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల్లో క్రీడలకు అపూర్వ ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని మంత్రి తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒలింపిక్ డే అందించే క్రీడా స్ఫూర్తిని మరింత విస్తృతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Previous బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం
Next నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
ADVERTISEMENT