| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం

పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలి

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, సుదీర్ఘకాలం పోలీసు శాఖకు విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన ఏ. సాయిలు (ఏఎస్‌ఐ, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్) ని కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహ రెడ్డి పాల్గొని, పదవీ విరమణ పొందిన అధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, దాదాపు 36 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో క్రమశిక్షణ, అంకితభావం, నిజాయితీతో సేవలందించిన ఏ. సాయిలు సేవలను కొనియాడారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు శాఖకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, కుటుంబంతో కలిసి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించేందుకు ఇది ఒక కొత్త అధ్యాయమని తెలిపారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, మానసిక ప్రశాంతత కోసం సానుకూల దృక్పథంతో జీవించాలని సూచించారు.

అలాగే, పదవీ విరమణ అనంతరం అందవలసిన అన్ని ప్రయోజనాలు సకాలంలో అందేలా పోలీసు శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఎదురైతే శాఖ తరఫున పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు.

ఏ. సాయిలు 1990 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరి, వివిధ హోదాల్లో సేవలందిస్తూ దాదాపు 36 సంవత్సరాలపాటు ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించి ఈరోజు పదవీ విరమణ పొందారు.

చివరిగా, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి, మిగిలిన జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖశాంతులు, ఆనందాలతో గడపాలని అదనపు ఎస్పీ ఆకాంక్షించారు. అనంతరం అధికారులు, సిబ్బంది కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు సంతోష్ కుమార్, శ్రీ కృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, ఎస్‌ఐలు, కుటుంబ సభ్యులు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Previous మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Next మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
ADVERTISEMENT