డైలీ భారత్, మహబూబ్ నగర్: అబ్దుల్ కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టి.ఎన్. శ్రీధర్ నిర్వహణలో, ఏప్రిల్ 24, 2026 నుండి మే 5, 2026 వరకు 12 రోజులపాటు 9వ తరగతి పూర్తి చేసి 10వ తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ విషయాలను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఇట్టి అవకాశం దమ్మన్నపేట విద్యార్థులకు రావడం అభినందనీయం అని ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలిపారు
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను హైదరాబాద్‌లోని ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థలు అయిన ఐ ఐ సి టి(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ), సి సి ఎం బి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ), ఐ ఎం డి(ఇండియా మెటరోలాజికల్ డిపార్ట్మెంట్), ఎన్ ఐ ఎన్ (నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్)లను సందర్శింపజేసి, అక్కడ జరుగుతున్న పరిశోధనలు మరియు శాస్త్రవేత్తల పనితీరును ప్రత్యక్షంగా అవగాహన చేసుకోవడమే కాకుండా అక్కడి శాస్త్రవేత్తలతో ముచ్చటించే గొప్ప అవకాశం కల్పించారు.
ఈ శిక్షణలో దమ్మన్నపేట్ పాఠశాల నుండి ఈరబోయిన నందిని, అరిగే వర్షిత్ పాల్గొన్నారు. అన్ని విషయాలను ప్రయోగాత్మకంగా బోధించడం ద్వారా పాఠ్యాంశాలపై లోతైన అవగాహన కలిగిందని, ఇది తమకు గొప్ప అవకాశమని వారు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి విలువైన అవకాశాలను కల్పించిన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బందిని తల్లిదండ్రులు అభినందించారు