ఒక్క గ్యారంటీకే గగ్గోలు పెడుతుండ్రు.
పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. సీతక్క.
డైలీ భారత్, సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి ప్రజా సంక్షేమ కోసమే ఖర్చు పెడుతుందని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్ లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమంటూ మాట్లాడిన విషయాలను గుర్తు చేశారు. 16 నెలల నుంచి 1200 కోట్ల బకాయిలు గత ప్రభుత్వం సర్పంచ్ లకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ లను పట్టించుకోని వాళ్లు ఇప్పుడు మాట్లాడడం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ లకు ఇవ్వాల్సిన స్టేట్ ఫైనాన్స్ విధులను దారి మళ్లించిన గత ప్రభుత్వం సర్పంచ్ ల దుస్థితికి కారణమని సీతక్క అన్నారు. పరిస్థితులను సరి చేసే పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తుందని అన్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని అన్నారు. 6 గ్యారంటీలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక్క గ్యారెంటీ అమలు చేస్తేనే ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతుందని అసత్యాలు ప్రచారం చేస్తుందని ప్రజలు గమనించాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను అమలు చేస్తామని తెలిపారు. ఇప్పటికే పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఐదో తేదీ లోపే ప్రభుత్వం వారి ఖాతాల్లో వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం వేములవాడ ఆలయం అభివృద్ధి చేస్తామన్న మాటను విస్మరించిందని ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.