డైలీ భారత్ ఉత్తరాఖండ్: ఇకపై సహజీవనం చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానుంది. అంతేకాక, అన్ని మతాల వివాహాలకు ఇప్పుడు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి. ఈ కొత్త రూల్ ఈ రోజు నుంచే అమల్లోకి రానుంది.జనవరి 27 నుంచి ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి యూనిఫాం సివిల్ కోడ్ అమలులోకి రాబోతోంది. వివాహం, విడాకులు, వారసత్వం వంటి అన్ని అంశాలకు సమానమైన నిబంధనలు అమలు చేయడానికి ఉద్దేశించిన ఈ చట్టానికి గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది.ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ధృవీకరించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించబోతుందని ఆయన తెలిపారు. చట్ట అమలుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామని చెప్పారు.ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యూసీసీ అమలుతో అన్ని మతాలు, కులాలు సమానత్వం దిశగా సాగుతాయని, ఎలాంటి వివక్షకు తావు ఉండదని వివరించారు. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు కల్పించేలా ఈ చట్టం రూపొందించబడిందని అన్నారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ అమలుకు బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ చట్టం అమలుకు పునాదులు వేశామని ధామి వెల్లడించారు.ఎన్నికల వాగ్దానం ప్రకారం, ఇప్పుడు యూసీసీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ప్రతిసారి ఈ అంశం బీజేపీ ప్రధాన ఆయుధంగా ఉంటోందని, ఎట్టకేలకు ఈసారి అమలు చేయడం సాధ్యమైందని చెప్పారు.
News
ఇకనుంచి సహజీవనానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి?