గిరిజన విద్యార్థినికి తక్షణ సాయం రూ.10 వేలు
డైలీ భారత్, హైదరాబాద్: ప్రభుత్వ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని పూజ ఇటీవల ప్రమాదానికి గురైన సంఘటనపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని పూజ తల్లిదండ్రులు బాబ్యానాయక్ బుజ్జి బాయ్, తదితరులు కాంగ్రెస్ ఆదివాసి సెల్ జిల్లా నాయకులు శీను నాయక్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు ఆకాష్ సహకారంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ పూజ తల్లిదండ్రులతో మాట్లాడారు. జరిగిన విషయం గురించి తెలుసుకున్నారు. పూజ గాయపడడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవ శాత్తు విద్యార్థిని పూజ బిల్డింగ్ పై నుండి కింద పడిందని ఇందులో ఎవరి పొరపాటు లేదని చెప్పడంతో ఎమ్మెల్యే ఆమె చికిత్స కు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెడిసిన్స్ కోసం వెంటనే సొంతంగా పదివేల రూపాయలను విద్యార్థిని తండ్రి భవ్య నాయక్ కు అందజేశారు. అదేవిధంగా నిమ్స్ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులతో మాట్లాడారు. నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరి గూడెం మండలం ముష్టిపల్లి కొత్త రామ తాండకు చెందిన విద్యార్థిని పూజకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తర్వాత అందజేస్తామని గిరిజన నాయకులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు ఆకాష్ నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆర్థికంగా సహకరించడమే కాకుండా వైద్య అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.