| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మటన్ ముక్కలు తెచ్చిన గొడవ... గరిటెలు, రాళ్లతో దాడి...

మటన్ ముక్కలు తెచ్చిన గొడవ... గరిటెలు, రాళ్లతో దాడి...

డైలీ భారత్, నిజామాబాద్: విందులో వధువరుల తరపు బంధువులు మటన్ ముక్కల కోసం కొట్లాటకు దిగారు. విందులో వడ్డించిన భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ మొదలైన ఘర్షణ కాస్త చినికిచినికి గాలివానగా మారింది.

పరస్పర దాడులతో ఉద్రిక్తంగా మారింది. వరుడి తరపు బంధువులు, వధువు తరపు వారు పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురు గాయపడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం జరిగింది. 

నిజామాబాద్‌ నవీపేట ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్‌హాలులో బుధవారం వివాహం జరిగింది. వివాహం అనంతరం జరిగిన విందులో వరుడి తరపున పెళ్లిక హాజరైన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు.

తమకు తక్కువ మటన్‌ ముక్కలు వేశారంటూ వడ్డించే వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వడ్డించే వారిని దూషించడంతో గొడవ మొదలైంది. వధువు తరపు బంధువులు కల్పించుకుని సర్ది చెబుతున్న క్రమంలో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. 

ఆవేశంతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. చేతికి అందిన వస్తువులతో ఘర్షణ పడ్డారు. ఈ ఘటనతో పెళ్లి విందులో ఉన్న వారు తలోదిక్కుకు పరుగులు తీశారు. వరుడి తరపు వారిపై దాడి చేశారంటూ ఓ వర్గం, తమపై దాడి చేశారంటూ వధువు బంధువులు వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు.

దీంతో ఫంక్షన్‌ హాలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివాహ వేడుకల్లో గొడవ జరుగుతున్న సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పారు. ఘర్షణకు కారణమైన వారిలో రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు.

ఇరువర్గాలకు చెందిన వారు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. గొడవలో గాయపడిన సత్యనారాయణ, సాయిబాబా సహా ఎనిమిది మందిని నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

పెళ్లి రోజే వధువరుల తరపు బంధువులు గొడవ పడి కేసుల్లో ఇరుక్కోవడంతో అంతా అవాక్కయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మటన్ ముక్కల కోసం తలలు పగులగొట్టుకున్నారని, మద్యం మత్తులో కొందరు యువకులు చేసిన నిర్వాకంతో పెళ్లింట చిక్కులు వచ్చాయని చెబుతున్నారు.

Previous ఢిల్లీ కూడా తగలబడిపోతుంది : మమతా బెనర్జీ హెచ్చరిక
Next హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే
ADVERTISEMENT