డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిపిఎస్ స్థానంలో ఏకీకృత పెన్షన్ పథకం (యు పి ఎస్) పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ విధానం మసిపూసి మారేడుకాయ చేయడమేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ స్పష్టం చేసింది.25 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు 50% పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లు, సర్వీసులో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 60% ఫ్యామిలీ పెన్షన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ చందాతో కూడిన పెన్షన్ పథకాన్ని రద్దు చేసే విషయాన్ని ప్రస్తావించకపోవటం పైగా ఐచ్ఛికం అని పేర్కొనటంలోనే అసలు మోసం ఉందన్నారు. ఒక్క రూపాయి చందా చెల్లించకుండానే సర్వీసును బట్టి 50% పెన్షను ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల్లిందేనని జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. పాత పింఛను పథకంతో పోల్చుకుంటే ఈ యు పి ఎస్ లో ఎంప్లాయ్ కంట్రిబ్యూషన్ అదనంగా ఉంది. ఉద్యోగి సొమ్ము షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల భద్రత లేదు, పెన్షన్ పై పిఆర్సి అమలు లేకపోవడం భవిష్యత్ లో ఉద్యోగికి వచ్చే పెన్షన్ లో పెరుగుదల ఉండదని అన్నారు. రాష్ట్రంలో సి పి ఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధరణకై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గోల్కొండ శ్రీధర్, గుండమనేని మహేందర్ రావు,అంబటి రమేష్, పర్కా ల రవీందర్ లు పాల్గొన్నారు.