డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ధర్మపురి శ్రీనివాస్ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో, ఆ తర్వాత కూడా బీసీలు, ఇతర బహుజనులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నతస్థాయి నాయకులుగా ఎదగడానికి తనవంతు తోడ్పాటు అందించారాని సీఎం గుర్తుచేశారు.
సహచర మంత్రులు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ఆదివారం నిజామాబాద్ లో డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో డీఎస్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
డీఎస్ ఎక్కడ ఉన్నా ఆత్మీయంగా మాత్రం కాంగ్రెస్ మనిషే అని సోనియా గాంధీగారు చెప్పేవారని, డీఎస్ మరణంపై సోనియా గాంధీ , రాహుల్ గాంధీ విచారం, సంతాపం వ్యక్తం చేశారని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రజానీకానికి డీ. శ్రీనివాస్ గారు చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోయేలా, ఆయన స్మారకార్థం ఏం చేస్తే బాగుంటుందో కుటుంబీకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పారు.