డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎన్నికల్లో గెలవడం అంటే అంతా ఈజీ కాదు.. వార్డు సభ్యుడిగా గెలవడానికే చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ కావడమంటే మామూలు విషయమా.. కానీ ఈ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీలు కావడం ఎంతో ఈజీ.. సాధారణంగా ఒక కుటుంబం నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యే, ఎంపీలు కావడమే అతికష్టం. సుదీర్ఘ రాజకీయ అనుభవం నుంచి, ప్రజల ఆదరాభిమానాలు పొందితేనే ఒకే కుటుంబంలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులు కాగలరు. ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు ఎంపీలయ్యారు. ఆ ఐదుగురు మంగళవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు.
అఖిలేష్ యాదవ్ తండ్రి దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ సుదీర్థకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ములాయంసింగ్ రాజకీయ వారసుడిగా అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీపార్టీ బాధ్యతలు స్వీకరించాడు. అఖిలేష్ కూడా యూపీ సీఎం పనిచేశారు. యాదవ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌లో గట్టిపట్టుంది. మరోవైపు బలమైన యాదవసామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆ కుటుంబానికి కలిసొచ్చింది. ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా పోటీచేసి గెలిచారు.
ఆ ఐదుగురు ఎవరంటే..?
సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుండి 2.21 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్ర యాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి, ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి విజయం సాధించారు..