వరంగల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రగతి క్షేత్ర స్థాయిలో పరిశీలన.
డైలీ భారత్, వరంగల్: అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువు లోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు.
బుధవారం వరంగల్ మండలం లోని మట్టేవాడ ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాల, గ్రైన్ మార్కెట్ లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, యెనుమామూల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, క్రిస్టియన్ కాలనీలోని ప్రభుత్వ ప్రాధమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా సందర్శించి అమ్మా ఆదర్శ కమిటీల ద్వారా గుర్తించి జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ద్వారా టాయిలెట్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్, సుందరీకరణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఎంపికైన 459 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు కొన్ని పాఠశాలల్లో పూర్తయినాయని, ఇంకను కొన్ని పాఠశాలల్లో పెయింటింగ్ డ్యూయల్ డెస్క్ లు, త్వరితంగా గ్రీన్ చాక్ బోర్డులు, ఏర్పాటు జరిగేలా ప్రత్యేక అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు.
అంతకుముందు వరంగల్ శివనగర్ లోని తెలుగుతల్లి మహిళ సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న ఏకరూప దుస్తుల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి కుట్టుతున్న దుస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా టీ ఎల్ ఎఫ్ లు నిర్వహిస్తున్న రికార్డులను , సైజులవారిగా దుస్తుల ఆర్డర్ తీసుకున్న, ఏకరూప దుస్తులను తయారుచేసి అందించిన వివరాలను పరిశీలించారు.
ఇప్పటికే మహిళ సంఘాల ద్వారా 70 శాతం ఏకరూప దుస్తులను కుట్టించి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగిందని, జూన్ 10వ తేదీలోగా ఏకరుప దుస్తులు విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాకు లక్ష 89 వేల 390 పాఠ్య పుస్తకాలు, 2 లక్షల 19 వేల 880 నోటు బుక్ లు ప్రభుత్వం అందాయని, వాటిని ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందజేయాలని డీఈవో ను ఆదేశించారు.
ఈ కార్యక్రమాల్లో డీఈఓ వాసంతి, మెప్మా డిఎంసి రేణుక, ఈఈ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు, ఎం ఈ ఓ, ఎం ఎన్ ఓ, టి ఎల్ ఎఫ్ లు తదితరులు పాల్గొన్నారు.