డైలీ భారత్, (స్పెషల్ స్టోరీ): బడులకు వెళ్తున్న విద్యార్థుల స్కూల్ బ్యాగులు చూస్తుంటే తల్లిదండ్రులుగా మనకు చాలా బాధేస్తుంది. ప్రతిరోజు ఇన్ని పుస్తకాలు మోసుకుంటూ బడికి వెళ్లాలా,ఇవన్నీ ప్రతిరోజు వాడుతారా,కొన్ని పుస్తకాలు తగ్గించుకోండి అని తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలను, విద్యార్థులను కోరుతున్న సందర్భాలను మనం చూస్తుంటాం. బ్యాగులో పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు పెట్టుకొని ప్రతి విద్యార్థి ఉదయం బడికి వెళ్తారు. ప్రభుత్వ బడుల లో చదివే విద్యార్థు లతో పోల్చుకుంటే ప్రైవేటు బడులకి వెళ్లే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు ఎక్కువగా ఉంటుంది. బరువు గల పుస్తకాలను మోస్తూ విద్యార్థులు రెండు, మూడు అంతస్తులు ప్రతిరోజు ఎక్కాల్సి వస్తుంది. అధిక బరువు గల పుస్తకాలను మోస్తూ విద్యార్థులు శారీరక , మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్‌లతో కూడిన స్కూల్ బ్యాగ్ గరిష్ట బరువు 1,2 తరగతులకు 1.5 కిలోలకు మించకూడదు; 3 నుండి 5 తరగతులకు 2-3 కిలోలు; 6, 7 తరగతులకు 4 కిలోలు; 8, 9 తరగతులకు 4.50 కిలోలు, పదో తరగతి విద్యార్థులకు 5 కిలోలు మాత్రమే ఉండాలి. కాని
ప్రాథమిక స్థాయిలో 7 కిలోల నుంచి 15 కిలోల వరకు, హైస్కూల్ స్థాయిలో 19 కిలోల వరకు బరువున్న బ్యాగులను బడి పిల్లలు ప్రతిరోజు బడికి మోసుకెళ్తున్నారని సమాచారం.
పుస్తకాల బరువు పెరగడం పై తల్లిదండ్రులు, డాక్టర్లు,
ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావి వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పుస్తకాల బరువును తగ్గించే చర్యలు చేపట్టింది. లోపలి పేజీలకి 70 జిఎస్ఎం కాగితం, కవర్ పేజీలకి 200 జిఎస్ఎం మందం గల కాగితం వాడి పాఠ్యపుస్తకాలు ప్రింట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో పుస్తకాల బరువు తగ్గనుంది.
రాష్ట్రంలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు 5898686 ల విద్యార్థులు చదువుతున్నారు. సర్కారు బడుల్లోచదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుంది, ప్రైవేట్ బడుల్లో చదివేవారు మాత్రం మార్కెట్లో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఒకటి నుండి 5వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలే వాడాలి, ప్రైవేట్ బడుల్లో ప్రభుత్వం రూపొందించిన పాఠ్యపుస్తకాలు కాకుండా ప్రైవేట్ గా రూపొందించిన పాఠ్యపుస్తకాలు వాడుతున్నారు.ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే ప్రభుత్వ మరియు ప్రైవేటు బడుల్లో ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ని తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలే వాడాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో
26074 మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు, 194 మోడల్ స్కూల్ లు,495 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, 31 అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు,1002 సంక్షేమ గురుకులాలు ఉన్నాయి.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 26,819 సర్కారు బడుల్లో ఈ విద్యా సంవత్సరంలో 2811906 ల విద్యార్థులు ఒకటి నుండి పదవ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తుంది.రాబోయే విద్యా సంవత్సరం 1.90 కోట్ల పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుందని అంచనా.
పాఠ్య పుస్తకాల బరువు పెరగడానికి ప్రధాన కారణం పుస్తకాలు తయారీలో మందం కాగితం వాడడమే.లోపలి పేజీల్లో 90 జి ఎస్ ఎం (గ్రామ్ ఫర్ స్క్వేర్ మీటర్), కవర్ పేజీలకు 220 జిఎస్ఎం కాగితాన్ని ఇప్పటివరకు వాడుతున్నారు.ఇలా కాగితం అందం పెంచడం వల్ల సుమారుగా ఒక్కొక్క తరగతికి ఒక కిలోగ్రామ్ వరకు బరువు పెరిగింది. దీనితో ప్రభుత్వానికి 50 కోట్ల అదనపు భారం.
ప్రస్తుతం ఒకటో తరగతి విద్యార్థి పాఠ్య పుస్తకాలు బరువు 1.991 కి.గ్రా ,5 వ తరగతి పార్టీ పుస్తకాల బరువు 2.253 కి.గ్రా,10 వ తరగతి 5.373 కి.గ్రా లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రాబోయే విద్యా సంవత్సరంలో నూతన పాఠ్యపుస్తకాల బరువు
ఒకటవ తరగతి కి 1.408 కి.గ్రా, ఐదో తరగతి కి 1.759 కి.గ్రా, పదవ తరగతి కి 4.19 కి గ్రా లుగా ఉండనున్నాయి.
ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థులకు పుస్తకాల బరువు 25% నుంచి 30% కి తగ్గనుంది. 3000 మెట్రిక్ టన్నుల పేపర్ వినియోగం కూడా తగ్గనుంది. గత సంవత్సరం 11,000 మెట్రిక్ టన్నుల పేపర్ వాడగా ,ఈసారి 8,000 మెట్రిక్ టన్నులు మాత్రమే వాడనున్నారు. తక్కువ పేపర్ వాడడం వల్ల పర్యావరణ నానికి మేలు జరుగుతుంది.
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థుల సౌలభ్యం కోసం పాఠ్యపుస్తకాలను ద్వి భాషలో అనగా తెలుగు మరియు ఆంగ్లం లతో పాటు పార్ట్ 1, పార్ట్ 2 లు గా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు.
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ఈ పుస్తకాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.ఏప్రిల్ 30 వరకు పార్ట్ 1 పాఠ్య పుస్తకాలు, జూలై 31 వరకు పార్ట్ 2 పాఠ్యపుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం
ఏర్పాట్లు చేస్తుంది. ప్రతీ పాఠ్యపుస్తకం పై గతంలో వలె క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ పాఠ్యాంశాల వీడియోలను డిజిటల్ కాంటెంట్ ను చూడవచ్చు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేధావులు ఉపాధ్యాయ సంఘాలు, డాక్టర్లు హర్షిస్తున్నారు.
ప్రతిరోజు అన్ని పాఠ్య పుస్తకాలు కాకుండా రోజువారిగా కొన్ని పాఠ్య పుస్తకాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ బడుల్లో మాదిరిగా ప్రైవేటు బడుల్లో కూడా ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలే ఉపయోగించేలా చర్యలు తీసుకుంటే ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు మరింత
తగ్గే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం. ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ప్రతీ నెల నాల్గవ శనివారం విధిగా నో స్కూల్ బ్యాగ్ డే నిర్వహించి కోకరికులర్ అంశాలు కూడా విద్యార్థులకు
నేర్పెలా చర్యలు తీసుకోవాలి.
పాకాల శంకర్ గౌడ్.
విద్యావేత్త.
9848377734.