డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : పట్టుదలతో అనేక సాహస విన్యాసాలు చేస్తున్న గ్రామీణ వాసి ఏకంగా నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన పనికెర క్రాంతి(36) ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రికార్డు సృష్టించారు. 8న న్యాయనిర్ణేతలు నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో విజయం సాధించినట్లు ప్రకటించి, ధ్రువపత్రాలను అందజేశారు. క్రాంతి ఆ విశేషాలను వివరించారు.
తిరుగుతున్న 35 టేబుల్ ఫ్యాన్లను 60 సెకన్లలో నాలుకతో ఆపడం గత రికార్డు కాగా క్రాంతి 57 ఫ్యాన్లు ఆపారు. గొంతులో కత్తులు దింపుకొని 1,696 కిలోల బరువును 5 మీటర్ల దూరం లాగడం ఇప్పటిదాకా ఉన్న రికార్డు కాగా క్రాంతి 1,944 కిలోల బరువును లాగి దానిని అధిగమించారు. 360 డిగ్రీల సెల్సియస్ వేడిలో మరుగుతున్న నూనెలో 12 చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం ఇప్పటిదాకా ఉన్న రికార్డు. క్రాంతి అలా 17 చికెన్ ముక్కలను బయటకు తీశారు. ముక్కులో నాలుగు అంగుళాల మేకులు దించుకునే అంశంలో ఇప్పటిదాకా ఎలాంటి రికార్డూ లేదు. క్రాంతి 60 సెకన్లలో తన ముక్కు లోపలికి నాలుగు అంగుళాల 22 ఇనుప మేకులను రక్తపు చుక్క రాకుండా సుత్తితో కొట్టి లోపలికి దించుకొని రికార్డు సృష్టించారు. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాలన్న తపన నాకు ఎప్పటి నుంచో ఉంది.’ అని క్రాంతి తెలిపారు.....