బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి! పిల్లలను చదివించాలి!
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు!
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం బాల్య వివాహాల నివారణపై బాల్య వివాహం బతుకు ఆగం పేరిట కార్యక్రమాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె హాజరై ప్రారంభించారు! బాల్య వివాహాల నివారణపై అందరితో కలిసి ప్రతిజ్ఞ చేశారు! బాల్య వివాహాలతో కలిగే ఆరోగ్య, ఇతర ఇబ్బందులపై వివరించారు!
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన మాట్లాడుతూ పిల్లల హక్కుల సంరక్షణ కోసం ముందు ఉంటామని స్పష్టం చేశారు! బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు! జిల్లా అధికారులు చైల్డ్ ఫ్రెండ్లీ అని కొనియాడారు! ప్రతి కుటుంబంలో వారి వారి మత పెద్దల పాత్ర ఎక్కువగా ఉంటుందని, లైంగిక వేధింపుల, బాల్య వివాహాల నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు! పిల్లలందరినీ చదివించేలా ప్రోత్సహించాలని సూచించారు! ఏ వయసు వారికి వివాహం చేస్తున్నామో కచ్చితంగా తెలుసుకోవాలని స్పష్టం చేశారు!
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు ప్రభుత్వం 2006లో చట్టం చేసిందని తెలిపారు! బాల్య వివాహం చేసే అందరికీ చట్టం ప్రకారం జైలు, జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు! సమాజంలో ప్రధాన మార్పులో అన్ని మతాల పెద్దలు కీలకమని తెలిపారు! అన్ని కుటుంబాలకు మంచి మాటలు చెప్పి మార్పుకు సహకరించాలని పేర్కొన్నారు! 18 ఏండ్ల లోపు అమ్మాయి, 21 ఏండ్ల లోపు అబ్బాయికి పెళ్లి చేయవద్దని సూచించారు! ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీ సెక్షన్ ఆపరేషన్లలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు! కాన్పు కోసం ఎలాంటి డేట్లు చెప్పవద్దని సూచించారు! బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు! ఏడాది కాలంలో 12 బాల్య వివాహాలు అధికారులు అడ్డుకున్నారని తెలిపారు! ప్రతి విద్యార్థి మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు! బాలల దత్తత కూడా చట్ట ప్రకారం తీసుకోవాలని సూచించారు!
ఎస్పీ మహేష్ బి గితె మాట్లాడుతూ బాల్య వివాహాల సమాచారం 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు! ఎక్కడైనా పెళ్లి సమాచారం తమకు వెంటనే ఇవ్వాలని తెలిపారు! అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాల్లో బాల్య వివాహాల నివారణ, పిల్లల చదువు, హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు! బాల్య వివాహాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు! బాల్య వివాహాలు చేస్తే రెండు ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా ఉంటుందని స్పష్టం చేశారు! బాల్య వివాహాల నివారణకు అందరూ సహకరించాలని కోరారు!
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు!
#DailyBharath #Sircilla #ChildMarriage #GarimaAgarwal #MaheshBGithe #Telangana