| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బతికున్న 22 మందిని చంపేసిన పంచాయతీ కార్యదర్శి!? ఇన్సూరెన్స్ కోసం డెత్ సర్టిఫికెట్ స్కామ్!?

బతికున్న 22 మందిని చంపేసిన పంచాయతీ కార్యదర్శి!? ఇన్సూరెన్స్ కోసం డెత్ సర్టిఫికెట్ స్కామ్!?

డైలీ భారత్, సిద్దిపేట (చేర్యాల):సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో అత్యంత కలకలం రేపే ఒక డిజిటల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బతికున్న 22 మంది గ్రామస్థులను చనిపోయినట్లు చూపిస్తూ నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు (డెత్ సర్టిఫికెట్లు) సృష్టించారు. ఈ దారుణ అక్రమం వెనుక ప్రభుత్వ అధికారిక డిజిటల్ సంతకాల వ్యవస్థ దుర్వినియోగం కావడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అసలు కథ ఇదీ..

రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న భుక్య మధు తన విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత రహస్యంగా, భద్రంగా ఉంచుకోవాల్సిన తన అధికారిక "ఈ-సైన్ డాంగిల్" (E-sign Dongle) కీని అదే గ్రామానికి చెందిన షేవల్ల రమేష్ అనే ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారు. రమేష్ హైదరాబాద్‌లో ఒక ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అధికారిక లాగిన్ యాక్సెస్ ఆధారంగా రమేష్ ఈ భారీ స్కామ్‌కు తెరలేపాడు.

2026 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు అక్రమాలు:

2026 ఫిబ్రవరి నెల నుండి సెప్టెంబర్ వరకు ఉన్న కాల వ్యవధిలో.. గ్రామంలో క్షేమంగా, బతికే ఉన్న 22 మంది వ్యక్తుల పేర్లను రమేష్ ఎంచుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి ఈ-సైన్‌ను అక్రమంగా వాడుకుంటూ, వారంతా చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలను సృష్టించి జారీ చేశాడు.

ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే స్కామ్!? 

ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం.. ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్లను సృష్టించడం వెనుక పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసే కుట్ర దాగి ఉంది. ఆయా వ్యక్తుల పేర్లపై ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ద్వారా లక్షలాది రూపాయల క్లెయిమ్ (భీమా) సొమ్మును అక్రమంగా కాజేసేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

కలెక్టర్ సీరియస్.. పోలీసుల రంగప్రవేశం:

ఈ భారీ అక్రమం ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు చేర్యాల పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు - దర్యాప్తు:

ప్రభుత్వ డిజిటల్ సంతకాల వ్యవస్థను దుర్వినియోగం చేసినందుకు, నకిలీ పత్రాలు సృష్టించినందుకు గానూ.. రాంపూర్ పంచాయతీ కార్యదర్శి భుక్య మధు తో పాటు ప్రైవేట్ వ్యక్తి షేవల్ల రమేష్ లపై చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో కేవలం వీరిద్దరే ఉన్నారా? లేక ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు లేదా ఇతర వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

#DailyBharath #Siddipet #Cheryala #Rampur #FakeDeathCertificate #InsuranceScam

Previous రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు,జైలు శిక్ష..!
Next బెంగాల్‌లో రేప్-మర్డర్ నిందితుడు ఎన్‌కౌంటర్! బీహార్‌కు పారిపోతుండగా కాల్చి చంపిన పోలీసులు!
ADVERTISEMENT