డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. విద్య, క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. బుధవారం మోపాల్ మండలం కంజర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల (బాలుర)లో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య అందించడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, వారంతా మట్టిలో మాణిక్యాలని కొనియాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, క్రీడా వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని, పాఠశాలకు అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని సైతం త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు.
పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు తమకు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంతకుముందు పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డికి స్థానిక విద్యార్థులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ మాత చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి, క్రీడా జ్యోతిని వెలిగించి జిల్లా స్థాయి క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించారు.