| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమయస్ఫూర్తితో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది

సమయస్ఫూర్తితో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది

నగదు రివార్డులతో అభినందించిన వరంగల్ సీపీ ఎన్. శ్వేత, ఐపీఎస్

డైలీ భారత్, వరంగల్: డయల్ 112 కు వచ్చిన ఒక్క ఫోన్ కాల్.. బ్లూకోల్ట్ సిబ్బంది సమయస్ఫూర్తి.. ఒక నిండు ప్రాణం నిలబడింది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ నగదు రివార్డులతో అభినందించారు.

హనుమకొండ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది, శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో వాళ్లకి చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. చాలా సమయం గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన అతని భార్య డయల్ 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించింది.

వెంటనే స్పందించిన కేయూ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్సై శ్రావణి లు బ్లూకోల్ట్ సిబ్బంది వీరాస్వామి, తరుణ్ కుమార్ లను అప్రమత్తం చేశారు.

దీంతో బ్లూకోల్ట్ సిబ్బంది సదరు వ్యక్తి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా చింతగట్టు గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. తక్షణమే అక్కడికి చేరుకుని, రైల్వే ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని గుర్తించి, అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

అనంతరం అతడిని తన కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సమయస్ఫూర్తితో స్పందించి విలువైన ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది వీరాస్వామి, తరుణ్ కుమార్ లను పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ అభినందించి, నగదు రివార్డులు అందజేశారు.

ప్రజల ప్రాణాలు, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విధి నిర్వహణలో అంకితభావం, బాధ్యతాయుతంగా పనిచేసే పోలీస్ సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి ధార కవిత, అదనపు డీసీపీ (పరిపాలన) రాయల ప్రభాకర్ రావు, కేయూ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ లు పాల్గొన్నారు.

 #WarangalPolice #BlueColt #Dial112 #CPShweta #Warangal #DailyBharath

Previous మానవత్వం చాటుకున్న సూర్యాపేట జిల్లా పోలీసులు... అనారోగ్యానికి గురైన హోంగార్డు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
Next కామారెడ్డి దుకాణాల యజమానులకు వార్నింగ్! కనీస వేతనం ఇవ్వకపోతే కఠిన చర్యలు
ADVERTISEMENT