| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జూలూరుపాడులో కులాలన్నీ ఒకే వేదికపై... సామాజిక సమరసతే జాతీయ సమైక్యతకు పునాది!

జూలూరుపాడులో కులాలన్నీ ఒకే వేదికపై... సామాజిక సమరసతే జాతీయ సమైక్యతకు పునాది!

జూలూరుపాడులో ఘనంగా గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం... సామాజిక సమరసతతోనే జాతీయ సమైక్యతకు బలమైన పునాది: అప్పాల ప్రసాద్ జీ

డైలీ భారత్, జూలూరుపాడు: కులాలకు అతీతంగా అందరూ ఒకే వేదికపైకి వచ్చిన అరుదైన దృశ్యం జూలూరుపాడులో ఆవిష్కృతమైంది. సంత్ రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ హాజరై మార్గదర్శనం చేశారు. మండలంలోని 13 గ్రామాల నుంచి వివిధ కుల సంఘాలకు చెందిన పెద్దలు, ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొని ముఖాముఖి కార్యక్రమంలో తమ అనుభవాలను పంచుకున్నారు.

అంటరానితనం పోతేనే జాతీయ సమైక్యత: అప్పాల ప్రసాద్ జీ

ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ.. గ్రామాల్లో అంటరానితనం, వివక్షత పూర్తిగా తొలగినప్పుడే జాతీయ సమైక్యతకు బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు.

సామాజిక వర్గాల పెద్దలు పరస్పరం కలిసి కూర్చొని, దేవాలయ ప్రవేశం, పండుగలు, సామాజిక కార్యక్రమాలను ఎలాంటి హింస, ద్వేషాలకు తావులేకుండా ఐక్యంగా నిర్వహించాలని సూచించారు. వివిధ కుల సంఘాల పెద్దలు తమ తమ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూనే, ఇతర సామాజిక వర్గాలతో స్నేహభావంతో కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న తీరు అభినందనీయమన్నారు.

అన్ని సామాజిక వర్గాలు పరస్పర స్నేహభావంతో కలిసి పనిచేయడం జాతీయ సమైక్యతకు ప్రతిబింబమని పేర్కొన్నారు.

“ఒకే దేశం - ఒకే ప్రజ”

ఈ సందర్భంగా 13 గ్రామాల నుంచి వచ్చిన కుల సంఘాల ప్రతినిధులు తమ గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉమ్మడి కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, తమ అనుభవాలను వివరించారు.

అప్పాల ప్రసాద్ జీ మాట్లాడుతూ “ఒకే దేశం – ఒకే ప్రజ” అనే భావనతో జాతీయ స్థాయిలో సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల మధ్య పరస్పర గౌరవం, సోదరభావం, సహకారం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

భారతదేశ సామాజిక చరిత్రను ప్రస్తావిస్తూ, బ్రిటిష్ పాలనలో “విభజించి పాలించు” విధానం ద్వారా భారత సమాజంలోని విభజనలను మరింత పెంచే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నేటి యువత కుల వివక్షకు తావులేకుండా స్నేహభావంతో ముందుకు సాగుతూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం అభినందనీయమన్నారు.

ఘన సన్మానం

ఈ సందర్భంగా పాల్గొన్న వివిధ కుల సంఘాల పెద్దలను అప్పాల ప్రసాద్ జీ శాలువాలతో సన్మానించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంచార యాత్ర రాష్ట్ర అధ్యక్షులు స్వర్ణ కుమార్, సామాజిక సమరసత వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, సోడె శ్రీరాములు, చిలుకూరి రమేష్, రోకటి రంగారావు, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, మద్దిబోయిన నాగరాజు, రామిశెట్టి నాగేశ్వరరావు, బుడుగు వీరస్వామి, భూక్య రమేష్, తెల్లం నరసింహారావు, ఇర్పా రామారావు, కాలం నరసింహారావు, మడి రవి తదితరులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.

#డైలీభారత్ #Julurupadu #SamajikaSamarasata #DailyBharath

Previous ఘోరం! గర్భిణి అని చూడకుండా భార్యను చంపి గోదావరిలో పడేసిన ఏఆర్ కానిస్టేబుల్!?
Next మానవత్వం చాటుకున్న సూర్యాపేట జిల్లా పోలీసులు... అనారోగ్యానికి గురైన హోంగార్డు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
ADVERTISEMENT